దేవరతో టాలీవుడ్ కు పరిచయమైన జాన్వీ కపూర్ డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఇది నిర్మాణంలో ఉండగానే ఆర్సి 16 పట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరితో ఒకేసారి వేర్వేరుగా నటించే అవకాశం ఇటీవలి కాలంలో తనకు మాత్రమే దక్కింది. కెరీర్ చక్కగా సెటిలయ్యింది కానీ చెల్లెలు ఖుషి కపూర్ మాత్రం ఇంకా ఏటికి ఎదురీదుతోంది. ఇటీవలే ఆమె నటించిన లవ్ యాపా రిలీజై డిజాస్టర్ కొట్టింది. తమిళ సూపర్ హిట్ లవ్ టుడే రీమేక్ గా రూపొందిన ఈ లవ్ కామెడీ ఎంటర్ టైనర్ ద్వారా అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ వెండితెరకు పరిచయమయ్యాడు. ఫలితం తుస్సు.
ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా రూపొందిన నాదానియాన్ మార్చి 7 నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటిటి ద్వారా రిలీజవుతోంది. ఇందులో కూడా ఖుషి కపూరే హీరోయిన్. పెద్దగా బజ్ లేదు. ప్రమోషన్లు చేస్తున్నారు కానీ ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలి. వీటికన్నా ముందు ఖుషి చేసిన మరో ఓటిటి మూవీ ఆర్చీస్ కూడా సూపర్ ఫ్లాపే. ఇలా వరసగా ఎదురు దెబ్బలు తినడం చూసి తండ్రి బోనీ కపూర్ ఖంగారు పడుతున్నారట. శ్రీదేవి లెగసి స్థాయిలో కాకపోయినా జాన్వీ క్రమంగా కుదురుకుంటోంది కానీ ఖుషికి ఇటు నటన, అటు అందం రెండు విషయాల్లోనూ ఆశించిన పాజిటివిటి కనిపించడం లేదు.
ఇవి కాకుండా ఖుషి కపూర్ చేతిలో కొత్త సినిమాలేం లేవు. సౌత్ లో పరిచయం చేయాలని బోనీ ప్రయత్నిస్తున్నారు కానీ ఆఫర్లు ఇచ్చేవాళ్ళు లేరట. ఈ మధ్య బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ కు షాకులు కొడుతున్నాయి. ఏ మాత్రం తేడా అనిపించినా ఆడియన్స్ మొహం మీదే తిరస్కరిస్తున్నారు. అందుకే షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తెలివిగా డైరెక్షన్ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నటన వైపు షిఫ్ట్ కాబోతున్నాడు. సల్మాన్ కు పెళ్లి కాలేదు. అమీర్ సన్ లాంచింగ్ అయిపోయింది. ఇక ఖాన్ల ద్వయంలో మిగిలింది షారుఖ్ ఒక్కడే. అందుకే బిడ్డ ప్లానింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.