అల్లు అర్జున్ కొత్త సినిమా ఎందుకు లేటు

పుష్ప 2 ది రూల్ విడుదలై మూడు నెలలు గడిచిపోయింది. ఇకపై వేగంగా సినిమాలు చేస్తానని చెప్పిన అల్లు అర్జున్ స్టేట్ మెంట్ కి భిన్నంగా ఇప్పటిదాకా కొత్త ప్రాజెక్టు స్టార్ట్ కాలేదు. నిన్న మ్యాడ్ స్క్వేర్ మీడియా మీట్ లో నిర్మాత నాగవంశీ 2025 ద్వితీయార్థంలో బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్యాన్ ఇండియా మూవీ మొదలవ్వొచ్చని చూచాయగా చెప్పారు తప్పించి కాన్ఫిడెంట్ గా అనలేదు. అంటే స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ కి మరింత ఎక్కువ సమయం పడుతుందని క్లారిటీ ఇచ్చినట్టే. దీనికన్నా ముందు కోలీవుడ్ దర్శకుడు అట్లీతో ఐకాన్ స్టార్ ఓ భారీ చిత్రాన్ని లాక్ చేసుకున్న సంగతి నెల రోజుల నుంచి చక్కర్లు కొడుతూనే ఉంది.

కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఎందుకు లేటవుతోందనే దాని మీద అంతర్గత వర్గాల నుంచి కొంత సమాచారం అందుతోంది. అట్లీ బన్నీ కాంబోని గీత ఆర్ట్స్ – సన్ పిక్చర్స్ కలిసి నిర్మించాలనేది ప్రాథమికంగా జరిగిన ఒప్పందం. అయితే హీరో (150) , దర్శకుడు (100) ఇతర తారాగణం రెమ్యునరేషన్లకే మూడు వందల కోట్లకు పైనే ఖర్చవుతుందనే లెక్క నిర్మాణ సంస్థలకు షాక్ కి గురి చేసిందట. ఇది కాకుండా ప్రొడక్షన్ కు ఎంత లేదన్నా రెండు వందల కోట్లు పక్కన పెట్టాల్సి ఉంటుంది. అంటే మొత్తం ప్రాజెక్టు ఖరీదు మొదటి స్టేజిలోనే అయిదు వందల మార్కు దాటేసింది. ఇక్కడే వచ్చింది మెలిక.

పుష్ప 1800 కోట్లు వసూలు చేసింది కాబట్టి అయిదారు వందలు పెడితే సులభంగా వర్కౌట్ అవుతుందని బయటి వాళ్లకు అనిపించవచ్చు. కానీ పుష్పకు అల్లు అర్జున్ ఇమేజ్ తో సమానంగా పుష్ప బ్రాండ్ బిజినెస్, ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ప్రతిసారి అలా ఆశించలేం. పైగా అట్లీ టేకప్ చేసి హిట్లు కొట్టినవన్నీ రొటీన్ కథలే. సో తన పేరు మీద పరుగులు పెట్టే ప్రేక్షకులు భారీగా ఉంటారని అనుకోలేం. ఇవన్నీ చూడబట్టే అట్లీ విషయంలో జాప్యం జరుగుతోందని అల్లు కాంపౌండ్ టాక్. ఏదోలా ఫైనల్ చేసుకుని సెటిల్ చేసుకుంటారు కానీ ప్రకటన మాత్రం ఉగాదిలోపే ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్.