బాలయ్యతో ఏజెంట్.. నిజమెంత?

Balakrishna
Balakrishna

తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడూ విచిత్రమైన కాంబినేషన్లు తెరపైకి వస్తుంటాయి. కొన్నేళ్ల కిందట నందమూరి బాలకృష్ణకు విలన్‌గా జగపతిబాబును పెట్టి ఇండస్ట్రీకే కాదు.. ప్రేక్షకులకు కూడా పెద్ద షాకే ఇచ్చాడు బోయపాటి శ్రీను. ఆ కాంబినేషన్ భలేగా వర్కవుటైంది. సినిమా సూపర్ హిట్టయింది. ఇప్పుడు బాలయ్య కొత్త సినిమా కోసం ఎవరూ ఊహించని విధంగా రావు రమేష్‌ను విలన్‌గా తీసుకున్నాడు బోయపాటి.

సాఫ్ట్‌గా విలనీ పండించే రావు రమేష్.. వయొలెంట్‌గా విలన్‌ను చూపించే బోయపాటి సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీంతో పాటు మరో ఆసక్తికర ఎంపిక జరిగినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఆ సినిమాలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని.. అతను బాలయ్యకు అసిస్టెంట్ పాత్రలో కనిపిస్తాడని వార్తలొచ్చాయి.

ఐతే నవీన్ నటన, అతడి సినిమాలు ఒక తరహాలో ఉంటాయి. వాటిలో క్లాస్ టచ్ ఉంటుంది. అతను ఇప్పటిదాకా బాలయ్య, బోయపాటి తరహా మాస్ మసాలా సినిమాలు చేసింది లేదు. తెలుగులో, హిందీలో కొంచెం భిన్నమైన సినిమాల్లో కొత్త తరహా పాత్రలే చేశాడు. ‘ఏజెంట్..’ సినిమాతో హీరోగా కూడా మంచి బ్రేక్ అందుకున్నాక అతను బాలయ్యకు అసిస్టెంటుగా బోయపాటి సినిమాలో నటించడమేంటి అనే సందేహాలు కలిగాయి.

ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై స్పష్టత ఇచ్చాడు నవీన్. తాను బాలయ్య సినిమాలో నటిస్తున్నానన్న ప్రచారం అబద్ధమన్నాడు. తన వద్దకు అలాంటి ఆఫర్ ఏమీ రాలేదన్నాడు. తెలుగులో తాను చేస్తున్న సినిమా ‘జాతి రత్నాలు’ మాత్రమే అని అతను స్పష్టం చేశాడు. స్వప్న సినిమా బేనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో రాహుల్ రామకృష్ణ మరో కీలక పాత్ర చేస్తున్నాడు.