భలే ఛాన్స్ కొట్టేసిన నితిన్ ‘తమ్ముడు’

నితిన్ అతి తక్కువ గ్యాప్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. మార్చి 28 రాబిన్ హుడ్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అదే డేట్ కి రావడం మీద అనుమానాలు నిజమయ్యే సూచనలు ఎక్కువ కావడంతో పోటీ పరంగా ఎలాంటి టెన్షన్ ఉండటం లేదు. మరుసటి రోజు మ్యాడ్ స్క్వేర్ తో చెప్పుకోదగ్గ కాంపిటీషన్ అయితే ఉంటుంది కానీ రెండు జానర్లు వేరు కనక టాక్స్ బావుంటే శుభ్రంగా ఆడేస్తాయి. ఇక నితిన్ మరో మూవీ తమ్ముడు మే 9 రావడం దాదాపు ఖరారైనట్టే. దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చని సమాచారం.

తెలివైన డేట్ అనడానికి కారణాలున్నాయి. మే 9 మంచి సెంటిమెంట్ ఉన్న బ్లాక్ బస్టర్ డేట్. జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, మహానటి, మహర్షి లాంటి ఎన్నో సూపర్ హిట్లు ఈ తేదీకి వచ్చి భారీ వసూళ్లు అందుకున్నాయి. తొలుత విశ్వంభర కోసం దీన్నే లాక్ చేద్దామనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, ఓటిటి డీల్ వల్ల సాధ్యపడకపోవచ్చనే ఉద్దేశంతో ఇప్పుడు జూన్ వైపు చూస్తున్నారు. రవితేజ మాస్ జాతర సైతం ఇదే స్లాట్ తీసుకోవాలని తొలుత ప్లాన్ చేసుకుంది. కానీ దీనికీ పలు ఇబ్బందులున్నాయట. నిర్మాత నాగవంశీ అది చెప్పాకే దిల్ రాజు మే 9కి కర్చీఫ్ సిద్ధం చేసుకున్నారని సమాచారం.

నిజానికి తమ్ముడు ముందు అనుకున్నది శివరాత్రికి. అంటే నిన్న మజాకా ప్లేస్ లో. కానీ షూటింగ్ చివర్లో పెద్ద షెడ్యూల్ ఆలస్యం కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. దానికన్నా ముందు రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ చేస్తూ రావడం తమ్ముడు మీద ప్రభావం చూపించింది. ఏదైతేనేం మే 9ని తీసుకోవడం నితిన్ కు చాలా ప్లస్ అవుతుంది. అయితే ఆ రోజు ఇంకేవీ రావా అంటే చెప్పలేం. ఒకవేళ ఘాటీ, హరిహర వీరమల్లు, కన్నప్పలో ఎవరైనా మనసు మార్చుకుని ఏప్రిల్ బరి నుంచి తప్పుకుంటే సమీకరణాలు మారొచ్చు. ప్రస్తుతానికి నితిన్ మాత్రం భలే డేట్ పట్టేసి హ్యాపీగా ఉన్నాడని చెప్పొచ్చు.