వీసా కోసమే పెళ్లి చేసుకున్న హీరోయిన్

రాధికా ఆప్టే.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ పేరు ఒక సంచలనం. ఆమె చేసిన, చేస్తున్న, చేయబోయే పాత్రలన్నీ చాలా వరకు వైవిధ్యమైనవే. చాలా బోల్డ్‌గా కనిపించే పాత్రలను తనదైన శైలిలో రక్తి కట్టించడంలో రాధికా దిట్ట. తనకే సొంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాధికా.. వ్యక్తిత్వ పరంగానూ చాలా భిన్నంగా, బోల్డ్‌గా కనిపిస్తుంటుంది.

ఆమె బ్రిటన్‌కు చెందిన బెనెడిక్ట్ టేలర్ అనే మ్యుజీషియన్‌ను కొన్నేళ్ల కిందట పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఐతే బ్రిటిష్ వాడిని పెళ్లి చేసుకున్నప్పటికీ రాధిక ఎక్కువగా ఇండియాలోనే ఉంటుంది. ఇక్కడే సినిమాలు చేస్తుంటుంది. ఎప్పుడో కానీ లండన్ వెళ్లదు. కెరీర్ కోసం ఇంతగా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తావేంటి అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. తాను పెళ్లి చేసుకున్నది వీసా కోసం అంటూ బాంబు పేల్చడం విశేషం.

ఈ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడిగినపుడు రాధికా స్పందిస్తూ.. ‘‘విదేశాల్లో ఉన్న వ్యక్తితో పెళ్లి జరిగితే వీసా అతి సులభంగా లభిస్తుందని తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నా. నా వరకు జీవితానికి హద్దులనేవి లేవు. నేను వివాహాన్ని నమ్మే వ్యక్తిని కాదు. ఈ వ్యవస్థపై నాకు నమ్మకం లేదు. వీసా పొందడం సమస్యగా మారిన తర్వాత కేవలం దాని కోసమే పెళ్లి చేసుకున్నా. కానీ మేమిద్దరం కలిసి జీవించాలని మాత్రం అనుకున్నాం. పెళ్లి మాత్రం వీసా కోసమే చేసుకున్నా’’ అంటూ కుండబద్దలు కొట్టింది రాధికా.

ప్రస్తుతం సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్న రాధికా.. లండన్‌లో భర్తతో గడుపుతోంది. తెలుగులో ఆమె లెజెండ్, లయన్ సినిమాల్లో నటించింది. కెరీర్ ఆరంభంలో ప్రకాష్ రాజ్‌తో ‘ధోని’ సినిమాలోనూ నటించింది. కానీ ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్లో తిరుగులేని పేరొచ్చింది. ఎన్నో సంచలన పాత్రలతో రాధికా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆమె తీరిక లేకుండా ఉంది.