‘కింగ్ డమ్’ ఎందుకు వెనుకబడింది

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న కింగ్ డమ్ తెలుగు టీజర్ విడుదలై 12 రోజులు గడిచింది. ఇప్పటిదాకా వచ్సిన వ్యూస్ 15 మిలియన్లు. మంచిదే కదా అనుకోవచ్చు. అయితే న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 ది థర్డ్ కేస్ కేవలం ఒక్క రోజులోనే 17 మిలియన్ల వ్యూస్ దాటేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి బడ్జెట్ పరంగా రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కింగ్ డమ్ మీద సితార సంస్థ వంద కోట్లకు పైనే పెడుతోంది. ఇంకా ప్రమోషన్ల కోసం పెట్టే ఖర్చు అదనం. కానీ హిట్ 3 ది థర్డ్ కేస్ కి అందులో సగం కూడా కాదనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం.

రెండింటి మధ్య పోలికని కాదు కానీ కింగ్ డమ్ ఎక్కువ రీచ్ తెచ్చుకోలేకపోవడానికి గల కారణాలు విశ్లేషించుకోవడం భవిష్యత్తు ప్రమోషన్లకు ఉపయోగపడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. విజయ్ దేవరకొండ ఎప్పుడూ చూడనంత వయొలెంట్ మేకోవర్ లో కనిపించాడు. ఇన్ని సానుకూలంశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఓ రేంజ్ రీచ్ రావాలి. కానీ కింగ్ డమ్ ఇంకా పాతిక మిలియన్లు చేరలేకపోవడం విచిత్రమే. రిపీట్ చూడాలనిపించే స్థాయిలో విజువల్స్ లేకపోవడం, కథను దాచే క్రమంలో పడిన పాట్లు ప్రభావాన్ని తగ్గించాయి.

ఇకపై వదిలే కంటెంట్ మాత్రం జాగ్రత్తగా కట్ చేయాల్సిన అవసరముంది. ముఖ్యంగా ట్రైలర్, పాటలు బజ్ ఎంత ఉండాలనేది నిర్ణయించబోతున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో శ్రీలంక సరిహద్దుల్లో శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామా రెండు భాగాలుగా ఉంటుందని గతంలో చెప్పారు కానీ టీజర్ లో అలాంటి హింట్ ఇవ్వలేదు. విడుదల తేదీ మే 30 ఇంకా దూరంలో ఉన్నట్టు అనిపిస్తున్నా అయిపోతున్న ఫిబ్రవరిని మినహాయిస్తే చేతిలో ఉన్నది మూడు నెలలే. ఇంకొంత బాలన్స్ షూటింగ్ ఉంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న కింగ్ డంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు.