దేనికైనా టైం రావాలని పెద్దలు ఊరికే అనలేదు. కాకపోతే ఆ సమయం వచ్చేవరకు ఓపికగా ఎదురు చూడాలి. అది ఉండబట్టే చిరంజీవికి ఖైదీ, విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి లాంటి కెరీర్ మార్చేసిన సినిమాలొచ్చాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే ఇటీవలే విడుదలైన డ్రాగన్ లో హీరోయిన్ గా నటించిన కయాదు లోహర్ గురించి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ ఎంటర్ టైనర్ తమిళంలో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. తెలుగులో కొత్త రిలీజులను డామినేట్ చేసి పది కోట్లు వసూలు చేసేలా ఉంది. ఇంతకీ కయాదు లోహర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూద్దామా.
2022లో శ్రీవిష్ణు హీరోగా అల్లూరి వచ్చింది. పెద్ద డిజాస్టర్. ఆడియన్స్ మొదటి రోజే తిరస్కరించారు. దాంట్లో హీరో భార్యగా నటించింది ఎవరో కాదు ఈ కయాదు లోహరే. ఆ తర్వాత ఒక మరాఠి, ఇంకో మలయాళం సినిమా చేసింది కానీ అవేమంత పేరు తీసుకురాలేదు. ఈ మూడేళ్ళ కాలంలో సరైన అవకాశం కోసం ఎదురు చూసింది. కట్ చేస్తే ఎందరో హీరోయిన్లు చేయమంటూ వద్దనుకున్న డ్రాగన్ కి ఎస్ చెప్పింది. తీరా చూస్తే ఇదే పాత్ర హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. డబ్బున్న అమ్మాయిగా అందం చందం రెండూ సరిగ్గా చూపించడంతో ఒక్కసారిగా ఈ అమ్మాయి డిమాండ్ పెరిగిపోయింది.
తమిళంలో మంచి ఆఫర్లు వస్తుండగా తాజాగా విశ్వక్ సేన్ ఫంకీలో తననే ఎంచుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. కయాదు లోహర్ స్వరాష్ట్రం అస్సాం. బికాం చదువు అయ్యాక నటి కావాలనే ఉద్దేశంతో మోడలింగ్ ఎంచుకుని ముంబై వచ్చేసింది. ప్రస్తుతం పూణేలో నివాసం ఉంటోంది. 2011 కన్నడ సినిమా ముగిలిపేటేలో డెబ్యూ చేసింది. తర్వాతో మల్లువుడ్ మూవీలో నటించింది. కలలు కన్న బ్లాక్ బస్టర్ మాత్రం డ్రాగన్ తోనే దక్కింది. దెబ్బకు ఆమె ఇన్స్ టా రీల్స్, ఫోటోలు వైరలవుతున్నాయి. రెమ్యునరేషన్ కూడా భారీగా ఆఫర్ చేస్తున్నారట. అంతే మరి దశ తిరిగినప్పుడు ఎవరైనా ఎలా ఆపగలరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates