పైరసీకి థాంక్స్ చెప్పిన అమీర్ ఖాన్

ఇప్పుడు ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య పైరసీ. ఈ మధ్య హెచ్డి రూపం సంతరించుకుని నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తోంది. బన్నీ వాస్, దిల్ రాజు లాంటి వాళ్ళు నిందితులను పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా అవి ఒక దశ దాటాక ఆగిపోతున్నాయి. అప్పటికంతా కొత్త సినిమా రన్ పూర్తయిపోవడమో లేదా ఈ భూతాన్ని ఆపరేట్ చేసే వాళ్ళు భారతీయ చట్టాలకు దొరకని దేశాల్లో ఉండటమో జరుగుతోంది. పరిష్కారం అంతు చిక్కడం లేదు. కానీ అమీర్ ఖాన్ రివర్స్ లో పైరసీకి థాంక్స్ చెబుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కాకపోతే చిన్న ట్విస్టు ఉంది.

2009లో వచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ 3 ఇడియట్స్ మూవీ లవర్స్ అంత సులభంగా మర్చిపోలేని క్లాసిక్. అమీర్ స్థాయిని అమాంతం పెంచిన మాస్టర్ పీస్ ఇది. శంకర్ అంతటివాడు తమిళంలో రీమేక్ చేస్తే ఆడలేదంటే ఒరిజినల్ వెర్షన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే చైనాలో తనను స్టార్ చేసింది 3 ఇడియట్స్ పైరసీనేని అమీర్ మొహమాటం లేకుండా చెబుతున్నారు. అప్పట్లో చైనాలో థియేటర్ రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ఈ సినిమా సిడిలు, డివిడిల ద్వారా అక్రమంగా వెళ్లిపోయిందట. టీవీలో చూసిన అక్కడి ఆడియన్స్ రాజ్ కుమార్ హిరానీ మాస్టర్ బ్రెయిన్ కి ఫిదా అయిపోయారు.

స్టూడెంట్ గా అమీర్ నటన వాళ్లకు కూడా ఫేవరిట్ హీరోగా మార్చేసింది. బాగుంది కదూ. ఇప్పుడు చైనాలో పైరసీ చట్టాలు, ఓటిటి నియంత్రణలు కఠినంగా ఉన్నాయి. 17 సంవత్సరాల క్రితం కాబట్టి చెల్లిపోయింది కానీ ఇప్పుడలా చేయడం కష్టం. సీక్రెట్ సూపర్ స్టార్, దంగల్ లు చైనాలో భారీ కలెక్షన్లు సాధించాయి. ఇటీవలే అమీర్ కొడుకు జునైద్ ఖాన్ మొదటి సినిమా లవ్ యాపా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. లవ్ టుడే రీమేక్ ని జనం రిసీవ్ చేసుకోలేదు. విచిత్రం ఏంటంటే అమీర్ థాంక్స్ చెప్పిన పైరసీ బారిన లవ్ యాపా కూడా బలయ్యింది. రెండో రోజే హై క్వాలిటీ ప్రింట్లు ఆన్లైన్ లో దర్శనమిచ్చాయి.