క్రేజీ టైటిల్ పట్టేసిన కమెడియన్

అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టి.. ఆ తర్వాత కమెడియన్‌ అవతారమెత్తి ఒక సమయంలో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సప్తగిరి.. ఆపై హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ, వజ్రకవచధర గోవిందా.. ఇలా లీడ్ రోల్స్‌లో వరుసగా సినిమాలు చేస్తూ పోయాడు సప్తగిరి. అతను నటించిన కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ రాను రాను సప్తగిరి సినిమాల్లో క్వాలిటీ పడిపోవడంతో తన సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. సునీల్‌ లాగా కాకుండా హీరోగా చేస్తున్నపుడు కామెడీ వేషాలు కూడా కొనసాగించడంతో కెరీర్ మరీ డౌన్ అయిపోలేదు.

ఒక దశ దాటాక హీరో వేషాలు పక్కన పెట్టేసి కమెడియన్‌గానే కంటిన్యూ అవుతున్నాడు. ఐతే ఒకప్పటిలా అయితే అతను వరుసగా సినిమాలు చేయట్లేదు. అప్పుడప్పుడూ ఏదో ఒక సినిమాలో తళుక్కుమంటున్నాడు. ఐతే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత సప్తగిరి తిరిగి హీరో అవతారం ఎత్తుతున్నాడు. సప్తగిరి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం.. పెళ్ళి కాని ప్రసాద్. ‘మల్లీశ్వరి’ సినిమాలో పెళ్ళి కాని ప్రసాద్ పాత్రలో విక్టరీ వెంకటేష్ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. ఈ క్యారెక్టర్ భలే క్లిక్ అయింది. ఇప్పటికీ ప్రసాద్ అనే పేరుండి, పెళ్లి కాకపోతే వాళ్లను పెళ్ళి కాని ప్రసాద్ అని ఏడిపిస్తుంటారు సొసైటీలో.

అలాంటి పాపులర్ పేరును తన కొత్త చిత్రానికి పెట్టుకోవడం సప్తగిరికి అడ్వాంటేజీనే. సైలెంటుగా మొదలై షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి గోపిడి రూపొందించాడు. కేవై బాబు, భాను ప్రకాష్ గౌడ్ అనే కొత్త నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ మూవీని దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది. పోస్టర్ మీద ఆ సంస్థ ముద్ర ప్రమోషన్ల పరంగా కలిసొచ్చేదే. ‘బలగం’ ఫేమ్ మురళీధర్ గౌడ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్ చూస్తే వినోదాత్మకంగా సాగేలా కనిపిస్తోంది. మార్చి 21న ‘పెళ్ళి కాని ప్రసాద్’ థియేటర్లలో సందడి చేయబోతున్నాడు.