ఇంటికన్నా ఎక్కువ రచ్చ గెలుస్తున్న డాకు

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన డాకు మహారాజ్ కి ఓటిటిలో భారీ స్పందన దక్కుతోంది. ఆశ్చర్యకరంగా మలయాళం ప్రేక్షకులు దీన్ని రిసీవ్ చేసుకుంటున్న తీరు ఫ్యాన్స్ ని షాక్ కు గురి చేస్తోంది. నిజానికి మంచి పాజిటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం వల్ల తీవ్రంగా ప్రభావితం చెందింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ జనాలు వెంకటేష్ కే ఓటు వేయడంతో రెండో వారం తర్వాత డాకు నెమ్మదించింది. ఎలివేషన్లు, మాస్ ఎపిసోడ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ డాకు పెర్ఫార్మన్స్ రెండు వందల కోట్లకు చేరలేకపోవడం అభిమానులు అసంతృప్తిగా ఫీలవుతున్నారు. కారణం అర్థమయ్యిందిగా.

డాకు మహారాజ్ సోలోగా రావాల్సింది. సంక్రాంతి పండగకు టార్గెట్ చేసుకోవడం మంచిదే కానీ అపోజిషన్ ని తక్కువ అంచనా వేయడం కొంత చేటు చేసింది. పైగా బాలయ్య నుంచి ఆశించే వన్నీ దర్శకుడు బాబీ పొందుపరిచినప్పటికీ నేటివిటీ పరంగా చూపించిన వైవిధ్యం, విలన్ కు సంబంధించిన బ్యాక్ డ్రాప్ రొటీన్ గా ఉండటం కొంత మైనస్ అయ్యింది. పాటలు తక్కువ కావడమూ ఒక లోటే. కానీ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రౌద్ర రూపంలో బాలయ్య పెర్ఫార్మన్స్ భాషలతో సంబంధం లేకుండా డాకు మహారాజ్ కు ఓటిటిలో వ్యూస్ తెస్తోంది. స్ట్రీమింగ్ మొదలైన కాసేపటి నుంచే నెట్ ఫ్లిక్స్ నెంబర్ వన్ లోకి వచ్చేసింది.

దీన్ని బట్టి అర్థం చేసుకోవలసింది ఏంటంటే కంటెంట్ ఎంత బాగున్నా రిలీజ్ టైమింగ్, సోలోగా రావడం చాలా కీలకం. ఇది పాటించడం వల్లే కల్కి 2898 ఏడి, దేవర, పుష్ప 2 ది రూల్ బాగా లబ్ది పొందాయి. వీటికి వారం ముందు వారం తర్వాత ఎవరూ రిలీజ్ పెట్టుకునే సాహసం చేయలేదు. ఒకవేళ డాకు మహారాజ్ కూడా ఇలాగే వచ్చి ఉంటే డబుల్ సెంచరీ నమోదయ్యేదన్న కామెంట్స్ ని కొట్టి పారేయలేం. సోషల్ మీడియా ట్రెండ్స్ స్పష్టం చేస్తోంది అదే. వసూళ్ల లెక్కలు పక్కనపెడితే ముచ్చటగా డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టేలా డాకు మహారాజ్ బాలకృష్ణకు మరో సూపర్ హిట్ ఇచ్చిన మాట వాస్తవం.