వీరమల్లు మారడం లేదు…..అపోజిషన్ తగ్గడం లేదు

నిర్మాతలు ప్రమోషన్లలో చెప్పుకుంటూ వచ్చిన దాని ప్రకారం హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల కావడం ఖాయమే. వాయిదా ప్రసక్తే లేదనే తరహాలో ప్రమోషన్లలో ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ఇంకొంచెం బ్యాలన్స్ ఉన్నప్పటికీ ఇంత ధీమాగా ఎలా ఉన్నారని ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. పవన్ ఒకపక్క రాజకీయ, సామజిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే కుంభమేళాకు వెళ్లొచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు డబ్బింగ్ చెప్పడానికైనా పవన్ కు టైం దొరుకుతుందానే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయినా సరే నో డేట్ ఛేంజ్ అనుకుందాం.

ఇక అపోజిషన్ సంగతి చూస్తే మార్చ్ 28 రాబిన్ హుడ్ వస్తోంది. మైత్రి వాళ్ళు క్రమం తప్పకుండా ఇదే డేట్ వేసుకుంటూ వస్తున్నారు. ఒకవేళ పవన్ సినిమా ఉందంటే ఆయన వీరాభిమనిగా నితిన్ ఈ క్లాష్ ని ఎంత మాత్రం ఒప్పుకోడు. తన దాకా ఎందుకు ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలుగా మైత్రి రవి, నవీనే ఆలోచించవచ్చు. అయినా సరే కాంపిటీషన్ కు సిద్ధపడితే మాత్రం బయటికి చెప్పలేని ఏవో కారణాలు ఉన్నాయని అనుకోవచ్చు. మార్చి 29 సితార వాళ్ళ మ్యాడ్ స్క్వేర్ రావడం ఫిక్సయిపోయింది. టీజర్ అనౌన్స్ మెంట్ యాడ్ లో దీన్ని మరోసారి స్పష్టం చేశారు. పవన్ తో నాగవంశీకున్న అనుబంధం తెలిసిందే.

మరి ఎవరికి వారు తమ డేట్ల మీద పట్టుబడటం చూస్తుంటే ఒకరకమైన అయోమయం రావడం సహజం. హరిహర వీరమల్లు లాంటి ప్యాన్ ఇండియా మూవీతో టాక్ తెలియకుండా తలపడేందుకు సిద్దపటడం ఎవరికైనా రిస్కే. కానీ రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ నిర్ణయాలు చూస్తే అసలు పవన్ మూవీ వస్తుందానే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. రేపు రిలీజ్ చేసే పాటతో రెండు లిరికల్ సాంగ్స్ వచ్చేసినట్టే. చావాకొచ్చిన స్పందన చూశాక మొఘలుల మీద తిరుగుబాటు చేసిన మన తెలుగు వీరుడు వీరమల్లుకి కూడా అంతే రెస్పాన్స్ వస్తుందని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.