ఓదెల 2…ఇంత షాక్ ఊహించలేదే

ఒక వెబ్ మూవీ లేదా సిరీస్ కి థియేటర్ సీక్వెల్ కొనసాగింపు ఆలోచన మా ఊరి పొలిమేర విజయవంతంగా చేసి చూపించాక మరికొందరు అదే దారిలో వెళ్తున్నారు. గతంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించిన క్రైమ్ థ్రిల్లర్ ఓదెల రైల్వే స్టేషన్ మంచి స్పందనే తెచ్చుకుంది. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కావడంతో ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది. దానికి రచన పర్యవేక్షణ చేసిన సంపత్ నంది ఈసారి చాలా పెద్ద స్కేల్ తో ఓదెల 2ని తీసుకొస్తున్నాడు. అశోక్ తేజ దర్శకత్వం వహించగా విరూపాక్ష, మంగళవారం లాంటి సూపర్ హిట్స్ కి సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ కి సంగీతం బాధ్యతలు అప్పగించారు.

ఇవాళ కుంభమేళాలో టీజర్ లాంచ్ చేశారు. విజువల్స్ చూస్తే షాకింగ్ కంటెంటే అనిపిస్తోంది. ఒక పల్లెటూరు. కంటికి కనిపించని దెయ్యమేదో సైకిల్ వేసుకొచ్చి మరీ హత్యలు చేస్తుంటుంది. ఊళ్ళో చిత్ర విచిత్రాలు జరుగుతాయి. మనుషులు ఉన్నట్టుండి మారిపోతారు. పూనకాలు పడతాయి. అప్పుడు వస్తుంది మహిళా అఘోరి (తమన్నా భాటియా). అడుగుపెట్టగానే లయకారుడు వచ్చినట్టుగా అనిపిస్తుంది. శివుడి గుడి చుట్టూ అల్లుకున్న రహస్యాన్ని ఛేదించేందుకు అఘోరి పూనుకుంటుంది. అదేంటనేది తెరమీద చూడాలి. మిల్కి బ్యూటీ తమన్నాని ఇంత ఇంటెన్స్ పాత్రలో చూడటం ఇదే మొదటిసారని చెప్పాలి.

మొత్తానికి అంచనాలు రేపడంలో ఓదెల 2 మొదటి అడుగు సరిగ్గా వేసింది. కాకపోతే ఇలాంటి విలేజ్ థ్రిల్లర్స్ గత కొన్నేళ్లలో చాలా వచ్చాయి. వర్కౌట్ చేసుకున్నాయి. కానీ హారర్ ఎలిమెంట్ కి డివోషనల్ టచ్ ఇచ్చింది మాత్రం ఈ సినిమానే అని చెప్పాలి. విడుదల తేదీ ఇంకా నిర్ణయించలేదు లేదు. ఏప్రిల్ నెలలో తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమన్నా ఇంత పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే క్యారెక్టర్ లో ఎలా ఒదిగిందనేది ఆసక్తికరం. క్యాస్టింగ్ కూడా పెద్దదే ఉంది. తెలుగుతో పాటు మొత్తం అయిదు భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల ఏర్పాట్లు చేస్తున్నారు. డేట్ అనౌన్స్ మెంట్ తర్వలోనే ఉంటుంది.

Odela 2 - Teaser | Tamannah Bhatia | Sampath Nandi | Ashok Teja | Ajaneesh Loknath