మహేష్ దగ్గరికెళ్ళిన చావా ?: నిజమేంటంటే…

గత రెండు రోజులుగా ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న చావా ముందు మహేష్ బాబు దగ్గరికే వచ్చిందని, కానీ తనకు సూటవ్వదనే అభిప్రాయంతో నో చెప్పడం వల్లే విక్కీ కౌశల్ కు వెళ్లిందని దాని సారాంశం. బాలీవుడ్ మీడియా చెబుతున్న దాని ప్రకారం దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ దీన్ని పూర్తిగా ఖండించేశారు. అసలు తన మనసులో ఎవరూ లేరని, చావా కథ రాసుకున్నప్పటి నుంచి విక్కీని ఊహించుకుంటూ స్క్రిప్ట్ రాశానని, దానికి అనుగుణంగానే అతను అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడని ప్రశంసించాడు. అసలు వేరే ఆప్షన్ ఆలోచించనే లేదని కుండ బద్దలు కొట్టాడు.

మహేష్ లాంటి స్టార్ తో ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం వదులుతారని కొసమెరుపు ఇచ్చాడు. ఇది నిజమే అయ్యుంటుంది. ఎందుకంటే చావా ఏదో కొన్ని నెలల క్రితం అప్పటికప్పుడు అనుకుని తీసిన సినిమా కాదు. మూడేళ్ళ నుంచి పైప్ లైన్ లో ఉంది. నిర్మాణానికి ఏడాదికి పైగానే పట్టింది. అంతకు ముందు స్టోరీ డిస్కషన్స్ కోసం నెలల తరబడి సమయం కేటాయించారు. మహేష్ కి చెప్పాలనే ఆలోచన కానీ, మన సూపర్ స్టార్ కి వినాలనే తీరిక లేని రెండూ లేవు. ఒకవేళ నిజంగా అనుకుని ఉన్నా మహేష్ ఇప్పటికిప్పుడు అలాంటి పాత్ర చేసే మూడ్ లో లేడు. అప్పటికే ఎస్ఎస్ఎంబి 29 ఓకే అయ్యింది.

అయినా పుకార్లకు రెక్కలు ఉండవు కాబట్టి ఎటెటో తిరగడం సహజం. మరో ట్విస్ట్ ఏంటంటే మహేష్ బాబుకి జోడిగా చావా కోసం కత్రినా కైఫ్ ని అనుకున్నారట. ఇది ఇంకా పెద్ద జోక్. విదేశీ వనితల ఛాయలుండే కత్రినాని మరాఠి మహారాణిగా ఊహించుకోవడం కష్టం. అందులోనూ నటన డిమాండ్ చేసే యేసుబాయ్ పాత్రలో. ఇదంతా పక్కనపెడితే చావా విక్కీ కౌశల్ కు తిరుగులేని బ్రేక్ ఇచ్చింది. వస్తున్న స్పందన చూసి తను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. ఇప్పుడీ శంభాజీ మహారాజ్ కథ పుణ్యమాని రచయితలు మరాఠా వీరుల గాథలను తవ్వే పనిలో పడ్డారు.