విక్కీ కౌశల్‌ను వారం ముందు వరకు స్టార్‌గా పరిగణించేది కాదు బాలీవుడ్. యురి, సర్దార్ ఉద్దమ్, శ్యామ్ బహద్దూర్ లాంటి హిట్లు తన ఖాతాలో ఉన్నప్పటికీ.. మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల చరిష్మా అతడికి లేదనే భావన ఉండేది. కానీ ‘చావా’ సినిమాతో మొత్తం మారిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ చూస్తే విక్కీ జస్ట్ స్టార్ కాదు, అంతకుమించి ఎదిగిపోయాడని అర్థమవుతుంది. ఈ సినిమాకు తొలి రోజు నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
సినిమా అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. వీకెండ్లో అదరగొట్టిన ఈ చిత్రం.. వీక్ డేస్‌లో కూడా అదే స్థాయిలో ఆక్యుపెన్సీలతో ఆడుతుండడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రానికి ఆరో రోజు రూ.32 కోట్ల వసూళ్లు రావడం షాకింగే. తొలి రోజు ఈ మూవీ రూ.32.5 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఆరో రోజు.. దాదాపు తొలి రోజుతో సమానంగా వసూళ్లు రావడమంటే చిన్న విషయం కాదు.
బుధవారం శివాజీ జయంతి కావడంతో ‘చావా’ చూడ్డానికి నార్త్ ఇండియన్స్ ఎగబడ్డారు. ‘చావా’ శివాజీ తనయుడు శంబాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సినిమా చూడ్డానికి శివాజీ జయంతి కంటే మంచి సందర్భం ఏముంటుంది? దీంతో దేశవ్యాప్తంగా ‘చావా’కు ఆరో రోజు మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. రెండో వారాంతంలోనూ ఈ చిత్రం కొత్త సినిమాలా వసూళ్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
కనీసం నెల రోజుల పాటు ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతున్న సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.400 కోట్ల మార్కును దాటే అవకాశముంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించాడు. ఈ మూవీని మ్యాడ్ రాక్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates