ఇటీవలే విడుదలైన లైలా విశ్వక్ సేన్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇదైనా కనీసం ఓ రెండు కోట్ల దాకా వసూలు చేసింది కానీ గతంలో ఇంతకన్నా దారుణంగా జీరో షేర్లతో పోయిన ఫ్లాపులకు రాని విమర్శలు లైలాకు ఎదురయ్యాయి. కారణం డబుల్ మీనింగ్ కంటెంట్. యూత్ కామెడీ పేరుతో దర్శకుడు రామ నారాయణ వేయించిన జోకులు అపహాస్యం పాలయ్యాయి. ఎంత అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ తెచ్చుకున్నా విశ్వక్ మీద జనంలో ఉన్న సదభిప్రాయం వల్ల మంచి వినోదం ఉంటుందని అందరూ ఆశించారు. కానీ లైలాలో అది పూర్తిగా హద్దులు చెరిగిపోయే స్థాయిలో ఉంది. ఇది హీరో ఇమేజ్ డ్యామేజ్ చేసింది.
ఈ పరిణామాలు గమనించిన విశ్వక్ సేన్ తాజాగా ఒక నోట్ రిలీజ్ చేశాడు. సినిమా పేరుని నేరుగా ప్రస్తావించకపోయినా లైలాని ఉద్దేశించి మాట్లాడుతూ దానిపై వచ్చిన నిర్మాణాత్మక విమర్శలను అంగీకరిస్తున్నానని, తన ప్రయాణంలో మద్దతు ఇచ్చి అండగా నిలబడిన వాళ్ళకు క్షమాపణ చెబుతున్నానని అందులో పేర్కొన్నాడు. ఒక చెడు సినిమా తీసినప్పుడు దాన్ని విమర్శించే హక్కు మీకు ఉంటుందని, నన్ను ప్రేమతో ఇక్కడి దాకా నడిపించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. ఇకపై మరింత బాధ్యతగా కథలు ఎంచుకుని తప్పులు జరగకుండా చూసుకుంటానని సుదీర్ఘమైన సందేశం పొందుపరిచాడు.
చూస్తూ వదిలేయకుండా విశ్వక్ సేన్ ఇలా స్పందించడం మంచిదే. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఆలోచించకుండా తొందరపడి తీసుకునే నిర్ణయాలు సినిమాలకు సంబంధించిందే అయినా ఒక్కోసారి తీవ్రమైన ఫలితాలు ఇస్తాయి. లైలాకు జరిగింది అదే. విశ్వక్ మెకానిక్ రాకీ విషయంలోనూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించి దెబ్బ తిన్నాడు. గ్యాంగ్స్ అఫ్ గోదావరి లాంటివి మంచి ప్రయత్నమే అయినప్పటికీ జనాన్ని పూర్తిగా మెప్పించలేకపోయాయి. ఇకపై అలెర్ట్ గా ఉంటానంటున్న ఈ యువ హీరో తర్వాతి సినిమా ఫంకీ. అనుదీప్ దర్శకత్వంలో సితార సంస్థ నిర్మిస్తున్న ఈ ఎంటర్ టైనర్ లో క్లీన్ కామెడీ ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.