ఇప్పటిదాకా కమెడియన్ వేషాలతోనే కాలం వెళ్లదీసిన సినీ నటుడు, వైసీపీ నేత అల్లూరి కృష్ణం రాజు అలియాస్ కృష్ణుడు బుధవారం రాత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముచ్చటపడి మరీ తీయించుకున్న ఫొటోను ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తన ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో నిజంగానే కృష్ణుడి మేకోవర్ అదిరిపోయిందని చెప్పాలి. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చాలా లావుగా కనిపించిన కృష్ణుడు… అదే ఫిజిక్ ను చాలా కాలం పాటు మెయింటైన్ చేశారు. ఆ ఫిజిక్ ను ఆయన అలా మెయింటైన్ చేశారు అనే కంటే కూడా… ఆ దృఢకాయాన్ని తగ్గించుకునే విషయంలో ఆయన పెద్దగా దృష్టి సారించలేదనే చెప్పాలి.
అప్పుడెప్పుడో ఆయననే హీరోగా పెట్టి ఓ సినిమా తీశారు కొందరు. సినిమా పెద్దగా ఆడకున్నా… కృష్ణుడి నటన మాత్రం బాాగా ఆకట్టుకుందనే చెప్పాలి. సినిమాల్లో ఉంటూనే ఎందుకనో ఆయన రాజకీయంగా కూడా అడుగులు వేశారు. చాలా మంది సినిమా వాళ్లలా కాకుండా కృష్ణుడు వైసీపీలో చేరిపోయారు. పార్టీలో చేరిన కొత్తల్లో పార్టీ తరఫున ఉత్సాహంగానే కార్యక్రమాల్లో పాలుపంచుకున్న కృష్ణుడు ఆ తర్వాత ఎందుకనో గానీ ఇనాక్టివ్ అయిపోయారు. అయితే వైసీపీకి మాత్రం ఆయన దూరంగా జరిగింది లేదు. తాజాగా తాడేపల్లి వచ్చిన కృష్ణుడు.. తన అభిమాన నేతను కలిశారు.
కృష్ణుడి ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి., సినిమాల్లో ఏదో కమెడియన్ పాత్రల్లో కనిపించే కృష్ణుడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు. చించినాడ కేంద్రంగా పాలన సాగించిన క్షత్రియ రాజు అల్లూరి వర్ష వెంకట సూర్యనారాయణ రాజు కుమారుడు కృష్ణుడు. 1970లలో నాటి ఇందిరా గాంధీ సర్కారు ప్రయోగించిన ల్యాండ్ సీలింగ్ యాక్టులో భాగంగా కృష్ణుడి కుటుంబానికి చెందిన 4,500 ఎకరాల భూములు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. నాడు ఒకే కుటుంబానికి సంబంధించి ఏపీలో ఇంత పెద్ద మొత్తంలో భూమిని కోల్పోయిన ఫ్యామిలీ కృష్ణుడిదేనట.