బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్న చావా మీద ప్రేక్షకులు విపరీతమైన ప్రేమ కురిపిస్తున్నారు. శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటన గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో ఆయన్ను 40 రోజుల పాటు సంకెళ్ళతో స్థంబాలకు కట్టేసి చిత్ర హింసలు పెట్టిన ఔరంగజేబు క్రూర మనస్తత్వం గురించి కూడా అంతే తిట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా సర్ప్రైజ్ అనిపించాడు. ఎప్పుడో తాళ్ లాంటి సినిమాల్లో ఐశ్వర్యరాయ్ ని ప్రేమలో పడేసిన లవర్ బాయ్ ఇతనేనా అంటూ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎక్కువ శరీర కదలిక లేకుండా అక్షయ్ ఇచ్చిన పెర్ఫార్మన్స్ అతని కెరీర్ బెస్ట్ లో ఒకటని చెప్పొచ్చు.
ఇక అసలు విషయానికి వద్దాం. మన హరిహర వీరమల్లులోనూ ఔరంగజేబు ఉన్నాడు. ఈ క్యారెక్టర్ ని బాబీ డియోల్ కి ఇచ్చారు. ఈయన భాగం తాలూకు షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. మొఘల్ సామ్రాజ్యం ఉన్నప్పుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఏం చేశాడనేది ఆసక్తికరమైన పాయింట్. చావాని చూసిన కళ్ళతో ఇప్పుడు తెలుగు ఔరంగజేబుని ఏ మాత్రం సాఫ్ట్ గా చూపించినా జనాలకు డౌట్లు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకుల నుంచి. మరి దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ దీన్ని ఎలా డిజైన్ చేశారో చూడాలి. చావా లాగా వీరమల్లులో ఔరంగజేబు చివరి దాకా ఉండకపోవచ్చు కానీ కీలక భాగమైతే కనిపిస్తాడు.
సో సినిమా వచ్చాక ఈ అంశం మీద ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పడంలో అనుమానం అక్కర్లేదు. మార్చి 28 విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు. టైం తక్కువగా ఉన్న నేపథ్యంలో నిజంగా డెడ్ లైన్ మీట్ అవుతారా లేదా అనే దాని మీద అనుమానాలు లేకపోలేదు. పవన్ ఏపీ డిప్యూటీ సిఎం అయ్యాక వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మాములుగా లేవు. జాప్యం వల్ల బజ్ హెచ్చుతగ్గులకు గురైనా సరైన రీతిలో ప్రమోషన్లు చేస్తే అదే ఊపందుకుంటుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ హిస్టారికల్ డ్రామాకు ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం సమకూర్చారు.