ఒకప్పుడు ఎంటర్ టైన్మెంట్ టీవీ చానెల్స్ దే రాజ్యం. ఏదైనా సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు హక్కులు కొనేందుకు ఆయా సంస్థల ప్రతినిధులు నిర్మాతల దగ్గర క్యూ కట్టేవాళ్ళు. కొత్త చిత్రం ప్రీమియర్ అంటే అదో సంబరంలా ఉండేది. జనాలు పనులన్నీ పూర్తి చేసుకుని షో టైంకి ఇంటిల్లిపాది కూర్చుని ఎంజాయ్ చేసేవాళ్ళు. అందుకే రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ ఓటిటిలు అందులోనూ కరోనా తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. నాలుగు వారాలతో మొదలుపెట్టి యాభై అరవై రోజుల గ్యాప్ లో థియేటర్ నుంచి డిజిటల్ కి ప్యాన్ ఇండియా సినిమాలు వచ్చేయడంతో సహజంగానే శాటిలైట్ కి గట్టుకాలం మొదలయ్యింది.
దీంతో ప్రొడ్యూసర్లు అడిగినంత రేట్ ఇవ్వడానికి ఛానల్స్ ఆసక్తి చూపించడం లేదు. ఎలాగూ ప్రేక్షకులు యాడ్స్ లేకుండా యాప్స్, వివిధ ఆన్ లైన్ మార్గాల్లో శుభ్రంగా కొత్త చిత్రాలు చూస్తుండటంతో టీవీల టిఆర్పి రేటింగ్స్ బాగా పడిపోయాయి. అందుకే ఎక్కువ సొమ్మును ఖర్చు పెట్టేందుకు వెనుకాడుతున్నాయి. కల్కి 2898 ఏడి ఈ సమస్యను ఎదురుకోవడం వల్లే చాలా ఆలస్యంగా శాటిలైట్ లో వచ్చింది. ఇప్పుడు దేవర కూడా ఇదే పడవలో ప్రయాణం చేస్తోంది. థియేటర్లో భారీ వసూళ్లను సాధించి నెట్ ఫ్లిక్స్ లో వారాల తరబడి ట్రెండింగ్ లో ఉన్న దేవర బుల్లితెరపై వచ్చేందుకు పెద్ద యుద్ధమే చేస్తున్నాడు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం దేవర శాటిలైట్ హక్కులు ఇంకా అమ్ముడుపోలేదు. ఛానల్స్ పలు ఆఫర్లు ఇచ్చినప్పటికీ నిర్మాత ఆశిస్తున్న దానికి వాళ్ళు చెప్పిన సొమ్ముకు భారీ వ్యత్యాసం ఉండటం వల్లే డీల్ కుదరడం లేదట. ఇప్పటికే అయిదు నెలలు గడిచిపోయాయి. అమ్ముడుపోయి ఉంటే ఈపాటికి ప్రీమియర్ కూడా అయిపోయేది. కొంచెం లేట్ అయినా ఏదో ఒక ఒప్పందం చేసుకుంటారు కానీ కొంత రాజీ పడక అయితే తప్పదు. సెట్స్ మీదున్న పెద్ద సినిమాలు చాలా వాటికి ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇది అంత సులభంగా పరిష్కారం అయ్యేది కాదు. ఓటిటి హవా తగ్గనంత కాలం శాటిలైట్ పుంజుకోవడం కష్టమే.