దక్షిణాదిన ప్రస్తుతం ఉన్న ఉత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. ఆమె నటించిన చిత్రాలు తక్కువే ఉన్నా.. నటిగా మాత్రం గొప్ప పేరు సంపాదించింది. మలయాళంలో నటించిన తొలి చిత్రం ‘ప్రేమమ్’తోనే ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి మంచి ఫాలోయింగ్ సంపాదించిన సాయిపల్లవి.. ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ ఫేవరెట్‌గా మారిపోయింది.
లవ్ స్టోరీ, గార్గి, అమరన్, తండేల్.. ఇలా సాయిపల్లవి నటించిన ప్రతి సినిమాలోనూ తన పాత్ర ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ‘గార్గి’ చిత్రానికి ఆమె జాతీయ అవార్డు సాధిస్తుందనే అంచనాలు కూడా ఏర్పడ్డాయి. కానీ ‘తిరు’ చిత్రానికి నిత్యా మీనన్ ఆ అవార్డును సొంతం చేసుకుని సాయిపల్లవికి నిరాశను మిగిల్చింది.
ఐతే సాయిపల్లవి నటన మీద నమ్మకం ఉన్న వాళ్లు.. ఏదో ఒక రోజు ఆమె జాతీయ పురస్కారం గెలుచుకుంటుందనే నమ్మకంతోనే ఉన్నారు. ఐతే స్వయంగా సాయిపల్లవి సైతం నటిగా జాతీయ అవార్డు సాధించాలని లక్ష్యం పెట్టుకుందట. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నట్లు కనిపించే సాయిపల్లవి.. తనకిలాంటి లక్ష్యం ఉందని చెబితే కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కానీ దాని వెనుక ఒక కారణం ఉన్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది సాయిపల్లవి.
‘‘అవును. జాతీయ అవార్డు అందుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. నాకు 21 ఏళ్ల వయసున్నపుడు మా బామ్మ నాకో చీర ఇచ్చింది. పెళ్లి చేసుకున్నపుడు దాన్ని కట్టుకోమంది. అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు. ఆమె చెప్పినపుడే పెళ్లి చేసుకున్నపుడే ఆ చీర కట్టుకోవాలనుకున్నా. కానీ తర్వాత నేను సినిమాల్లోకి వచ్చా. ‘ప్రేమమ్’ కోసం పని చేశా. కెరీర్ తొలి రోజుల్లోనే నేను ఏదో ఒక రోజు ప్రెస్టీజియస్ అవార్డు అందుకుంటానని అనుకున్నా.
జాతీయ అవార్డు అంటే ఎంతో గొప్ప కాబట్టి, అది అందుకున్న రోజు ఆ చీరను కట్టుకోవాలని నిర్ణయించుకున్నా. అది అందుకున్నా అందుకోకపోయినా.. ఈ చీర ధరించే వరకు నా మీద ఒత్తిడి ఉంటుంది’’ అని సాయిపల్లవి తెలిపింది.