సినిమాల ప్రమోషన్లు టాలీవుడ్లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుని ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకోవడంలో దర్శకులు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఆ మధ్య అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాంకి డిజైన్ చేసిన పబ్లిసిటీ చూసి తొలుత కామెంట్స్ వినిపించాయి కానీ మూడు వందల కోట్ల గ్రాస్ చూశాక ఎవరికైనా నోట మాట వస్తే ఒట్టు.
ఎంత వినూత్నంగా ప్రచారం చేసుకుంటే అంతగా ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకోవచ్చనేది కొత్త తరం ఫిలిం మేకర్స్ మంత్రం. మజాకా టీమ్ ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. ఇప్పటిదాకా లేని ట్రెండ్ ని తీసుకొస్తోంది.
రేపు చిత్రీకరించబోయే రావులమ్మ పాట షూటింగ్ ని లైవ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. ఉదయం పదకొండున్నరకు మొదలయ్యే షూట్ నుంచి మొత్తం అయిపోయే దాకా ప్రతిదీ టీవీ, ఫోన్ లో చూసుకోవచ్చన్న మాట. మధ్యలో లైవ్ చాట్ లాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి.
మాములుగా పాట తీయడమంటే ఏదో నిమిషాల్లో అయిపోయేది కాదు. గంటల తరబడి ఉంటుంది. ఎంత రిహార్సల్ చేసినా సరే రీ టేకులు, కాస్ట్యూమ్ మార్పులు, గ్రూప్ డాన్సర్ల మధ్య సమన్వయాలు, కొరియోగ్రాఫర్ పర్యవేక్షణలు ఇలా బోలెడు వ్యవహారాలు ఉంటాయి. ఒక్కోసారి ఉదయం స్టార్ట్ చేస్తే రాత్రి దాకా జరగొచ్చు.
మరి మజాకా టీమ్ ఎలా ప్లాన్ చేసిందనేది ఆసక్తికరం. ఫిబ్రవరి 26 విడుదల కాబోతున్నమజాకా, దర్శకుడు త్రినాధరావు నక్కినకు ధమాకా తర్వాత చేసిన సినిమా. సందీప్ కిషన్, రీతూ వర్మ హీరో హీరోయిన్ గా నటించగా రావు రమేష్ కు జంటగా ఒకప్పటి మన్మథుడు భామ అన్షుని వెతికి మరీ విదేశాల నుంచి తీసుకొచ్చారు.
భీమ్స్ సంగీతం, అవుట్ అండ్ అవుట్ కామెడీ ప్రధాన ఆకర్షణలుగా మజాకా మీద బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ నెలకొంది. తండేల్ తర్వాత తిరిగి థియేటర్లకు ఊపు తీసుకొచ్చే సినిమా ఇదేనని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. టాక్ పాజిటివ్ వస్తే వసూళ్లు బాగుండటం ఖాయం.