బలగం దారిలో వెళ్తున్న రామం రాఘవం

హాస్యనటులు దర్శకులుగా మారడం కొత్తేమీ కాదు. కాకపోతే సక్సెస్ అయిన వాళ్ళు తక్కువ. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ లెజెండరీ కమెడియన్లే అయినప్పటికీ డైరెక్టర్ గా హిట్లు కొట్టలేదు. కానీ వేణు యెల్దండి దాన్ని మార్చి చూపించాడు. స్టార్ క్యాస్టింగ్ లేకుండా బలగం లాంటి ఎమోషనల్ సబ్జెక్టుతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.

ముఖ్యంగా తెలంగాణలో ఈ సినిమా ఆడిన తీరు అంతా ఇంతా కాదు. దెబ్బకు దిల్ రాజు మరో అవకాశంతో నితిన్ హీరోగా ఎల్లమ్మ ఛాన్స్ ఇచ్చాడు. ఇదే స్ఫూర్తితో ధనరాజ్ రామం రాఘవంతో దర్శకుడిగా మారి వచ్చే వారం ఫిబ్రవరి 21 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో తండ్రి కొడుకుల భావోద్వేగాలను బాగా చూపించారు. అపురూపంగా పుట్టిన సంతానం డాక్టర్ అవుతాడనుకుంటే ఎందుకు పనికిరాని అప్రయోజకుడిగా మారి కుటుంబానికి తలవంపులు తెస్తాడు. అంతే కాదు ఎన్నో చిక్కుల్లో మునిగి లక్షల రూపాయలు అవసరమై నానా పాట్లు పడతాడు.

ఒకళ్ళంటే ఒకరికి పడని విచిత్రమైన రక్త సంబంధం మధ్య తల్లి నలిగిపోతూ ఉంటుంది. మరి రామం, రాఘవంల ప్రయాణం ఎక్కడికి చేరుకుందనేది తెరమీద చూడాలంటున్నారు. కంటెంట్ పరంగా ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ ఇద్దరికీ కావాల్సిన అంశాలు ధనరాజ్ రాసుకున్నాడు.

భారీ పోటీ లేకపోవడం రామం రాఘవంకు కలిసి రావొచ్చు. అలాని కాంపిటీషన్ లేదని కాదు. బ్రహ్మాజీ బాపు అదే రోజు వస్తోంది. ధనుష్ డైరెక్ట్ చేసిన డబ్బింగ్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమాకి పెద్ద ప్లానింగ్ జరుగుతోంది. ప్రదీప్ రంగనాధన్ మరో అనువాద చిత్రం రిటర్న్ అఫ్ ది డ్రాగన్ ని మైత్రి సంస్థ పంపిణి చేస్తోంది.

వీటి మధ్య రామం రాఘవం ఎదురీదాల్సి ఉంటుంది. కంటెంట్ ఉంటే హీరో ఎవరో పట్టించుకోకుండా హిట్టు ఇచ్చే తెలుగు ఆడియన్స్ ధనరాజ్ డెబ్యూకి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. బడ్జెట్ తక్కువలోనే తీసినా వేణు తరహాలో క్వాలిటీ మీద దృష్టి పెట్టిన ధనరాజ్ అదే ఫలితం అందుకుంటే మంచిదే.