ఇవాళ టాలీవుడ్ నుంచి రెండు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. ఒకటి లైలా, మరొకటి బ్రహ్మ ఆనందం. కాకతాళీయంగా రెండూ నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుని తీసినవి కావడం గమనార్హం. లైలా కోసం విశ్వక్ సేన్ చాలా రిస్కులు చేశాడు. ఆడ వేషం ఉందని ఇతర హీరోలు వద్దని తిరస్కరించిన కథను ఓకే చేశాడు.
అనుభవం లేని దర్శకుడిని నమ్మాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో డ్యామేజ్ చేసినా తట్టుకుని నిలబడ్డాడు. హైప్ పరంగా భారీ అంచనాలు నెలకొనలేదు టాక్ బాగా వస్తే ఆటోమేటిక్ గా ప్రేక్షకులు వస్తారనే నమ్మకంతో మంచి ప్రమోషన్లు చేసుకున్నాడు. ఇక తీర్పే తరువాయి.
బ్రహ్మ ఆనందం ద్వారా కొడుకు రాజా గౌతమ్ కి మంచి బ్రేక్ వచ్చేలా చేయడంతో పాటు తన నట తృష్ణ మరింత తీర్చుకునే ఉద్దేశంతో అంతా తానై పబ్లిసిటీ నడిపించారు బ్రహ్మానందం. ఈవెంట్ కి ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చారు. ఎడతెరిపి లేకుండా ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ప్యాడ్ క్యాస్ట్ వాళ్ళు అడిగినా నో అనలేదు. కంటెంట్ మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ముందు రోజు సాయంత్రం ప్రీమియర్లు వేయరు. దానికీ సిద్ధపడ్డారు. ఉదయం ఆటకు జనం కనిపించారంటే అది కేవలం ఆయన క్రెడిట్ తప్ప వేరొకటి కాదు. ఆశించినట్టు పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే బాక్సాఫీస్ వద్ద నెగ్గుకురావచ్చు.
వీటితో పాటు పాత రీ రిలీజులు ప్రేమికుల రోజున పోటీ పడుతున్నాయి. ఆరంజ్, సూర్య సన్ అఫ్ కృష్ణన్, పేరు మార్చుకున్న కృష్ణ అండ్ హిజ్ లీలకు లవర్స్ పోటెత్తుతారని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ మూవీ చావా మీద తెలుగు రాష్ట్రాల్లో అంత హైప్ లేకపోయినా టాక్ వస్తే మాత్రం వసూళ్లు ఊపందుకుంటాయి.
వీటి సంగతి ఎలా ఉన్నా లైలా, బ్రహ్మ ఆనందంలో ఎవరు నెగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. క్రికెట్ మ్యాచ్ టై అయినట్టు ఇద్దరూ గెలవడం అవసరం. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, తండేల్ తర్వాత మరో హిట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటే థియేటర్లు జనంతో మళ్ళీ కళకళలాడతాయి.