టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం లైలా పై కొనసాగుతున్న వివాదానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడిందని చెప్పక తప్పదు. ఈ వివాదాన్ని రేపిన కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
తాను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని చెప్పిన పృథ్వీ… బాయ్ కాట్ లైలాకు స్వస్తి పలకాలని, వెల్ కమ్ లైలా అంటూ స్వాగతం పలకాలని కోరారు. సారీ చెబుతూ పృథ్వీ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవలే లైలా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగగా…ఆ వేదిక మీద మాట్లాడిన పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ… తన బామ్మర్లుల వద్ద 150 గొర్రెలు ఉంటాయని, చివరకు వాటిలో 11 మాత్రమే మిగులుతాయంటూ తనదైన హాస్యరస శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తమ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లను హేళన చేస్తూనే పృథ్వీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే పృథ్వీ క్షమాపణలు చెప్పాలని, అప్పటిదాకా లైలాను బాయికాట్ చేస్తామని శపథం చేశారు.
ఈ క్రమంలో సినిమా హీరో విశ్వక్ సేన్ ఆ మరునాడే ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణ చెప్పారు. అయినా కూడా వైసీపీ శ్రేణులు తగ్గకపోవడంతో చాలా మంది సలహాలతో శాంతించిన పృథ్వీ.. సారీ చెబుతూ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో తనదైన చమత్కారాన్ని రంగరించిన పృథ్వీ… గోదావరి జిల్లాలో పుట్టిన వాడిగా వెటకారం తనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాడు.
అయినా కూడా ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తిని ఉంటే క్షమించండి అంటూ ఆయన వేడుకున్నాడు. ఇకపై ఈ వివాదాలను వదిలేద్దామని… సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడనని తెలిపారు.