వావ్… తెనాలి రామకృష్ణగా నాగచైతన్య

దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన అజరామరమైన పాత్రల్లో తెనాలి రామకృష్ణ చాలా ముఖ్యమైంది. ఎన్టీఆర్ అంతటి దిగ్గజం శ్రీకృష్ణ దేవరాయలుగా ఎదురుగా ఉన్నా సరే తన నటనా చతురతతో మెప్పించి చప్పట్లు కొట్టించుకోవడం ఏఎన్ఆర్ కే చెల్లింది.

పుస్తకాల్లో రామలింగడు ఎలా ఉంటాడో కానీ ఈ సినిమా చూశాక మనసులో ఏఎన్ఆర్ అలా ముద్రించుకుపోయారు. తర్వాత మళ్ళీ ఆయన్ని మరిపించేలా ఎవరూ ఆ క్యారెక్టర్ చేయలేకపోయారు. ఆదిత్య 369లో చంద్రమోహన్ తళుక్కున మెరిశారు కానీ అదేమీ ఫుల్ లెన్త్ రోల్ కాదు కాబట్టి పరిగణనలోకి తీసుకోలేం. ఇక అసలు విషయానికి వద్దాం.

తండేల్ సక్సెస్ మీట్ లో దర్శకుడు చందూ మొండేటి త్వరలో ఒక చారిత్రాత్మక చిత్రం చేయబోతున్నామని, ఇప్పటి తరానికి ఎలా చెప్పాలో ఎలా చూపించాలో, తెనాలి రామకృష్ణ కథను ఎలా రాయాలో దాని మీద పని చేస్తున్నామని చెప్పి స్వీట్ షాక్ ఇచ్చాడు. పనిలో పని శోభితకు తెలుగు బాగా వచ్చు కాబట్టి చైతుకి ఇంకా బాగా నేర్పించమని అడిగేశాడు.

అయితే బ్యానర్, బడ్జెట్ తదితర వివరాలు చెప్పలేదు కానీ ఊహించని గుడ్ న్యూస్ పంచుకున్నారు. నాగార్జునకు అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయిలా నిజంగా కార్యరూపం దాలిస్తే చైతుకి తెనాలి రామకృష్ణ కెరీర్ బెస్ట్ క్లాసిక్ గా మిగిలిపోవడం ఖాయం.

తన ప్రసంగంలో నాగార్జున మాట్లాడుతూ చైతుని చూస్తుంటే నాన్నగారు గుర్తొచ్చారని చెప్పడం చూస్తే అందరూ ఒకే పాయింట్ మీద ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. వంద కోట్ల క్లబ్ కు దగ్గరగా ఉన్న తండేల్ ఇంకో నాలుగైదు రోజుల్లో ఆ ఫీట్ అందుకోనుంది.

సంక్రాంతి వదులుకుని ఫిబ్రవరిలో రావడం పట్ల ఫ్యాన్స్ తొలుత కొంత అసంతృప్తి చెందినా ఇప్పుడొస్తున్న స్పందన చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సాయిపల్లవి నటన అన్నింటిని మించి నాగచైతన్య పెర్ఫార్మన్స్ తండేల్ ని సూపర్ హిట్ దశని దాటించేసింది. బ్లాక్ బస్టర్ అందుకోవడమే తరువాయి. అది కూడా దగ్గర్లోనే ఉంది.