రోజా క్లాసిక్ ఎందుకయ్యిందో తండేల్ చూస్తే తెలుస్తుంది

నిన్న విడుదలైన తండేల్ గురించి కొంత మిశ్రమ స్పందన వినిపిస్తున్నప్పటికీ ఓవరాల్ గా మంచి వసూళ్లతో ఓపెనైన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. గత మూడు సినిమాలకు రాని పాజిటివ్ టాక్ నాగచైతన్యకు దక్కడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీనే. అయితే యునానిమస్ గా ఊహించిన అభిమానులకు, ప్రేక్షకులకు అది జరగకపోవటానికి కారణం కొంత తరచి చూస్తే అర్థమవుతుంది.

పాకిస్థాన్ తో శత్రుత్వం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే టీవీ సెట్లకు అతుక్కుపోయే జనాలు లక్షలు కాదు కోట్లలో ఉంటారు. వందల సినిమాల్లో ఈ ఎనిమి థ్రెడ్ వాడుకుని బ్లాక్ బస్టర్స్ సాధించిన దర్శకులు ఎందరో.

దర్శకుడు చందూ మొండేటి కూడా అలాగే ఆలోచించాడు. కానీ తండేల్ లో ఎక్కువ కామెంట్లకు గురైన ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అది పాకిస్థాన్ జైలు ఘట్టమే. అసలు ఈ బ్లాక్ ని ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుందనే విషయం అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 1992లో మణిరత్నం రోజా వచ్చింది.

దేశానికి ఎంతో సేవ చేయాల్సిన తన భర్తను పాక్ టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తే ఢిల్లీ కదిలిపోయేలా ఒక మహిళా చేసే పోరాటమే ఆ చిత్ర కథ. సున్నితమైన ఈ పాయింట్ ని మణిరత్నం చూపించిన తీరు రోజాని ఎప్పటికీ చెప్పుకునే ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మార్చింది. ఇంకొంచెం డీటెయిల్డ్ గా చూద్దాం.

ఒక సీన్ లో మన జాతీయ జెండాకు ఓ తీవ్రవాది నిప్పు పెడతాడు. వెంటనే అరవింద్ స్వామి దాని మీద పడిపోయి తన ఒళ్ళు కాలుతున్నా లెక్కచేయకుండా మంటలార్పుతాడు. వెనుక బ్యాక్ గ్రౌండ్ లో ఏఆర్ రెహమాన్ రోమాలు నిక్కబొడుచుకునే సంగీతం నరనరాల్లో దేశభక్తిని నింపుతుంది.

అంతే కాదు హీరోకు, టెర్రరిస్టు లీడర్ కు మధ్య జరిగే సంభాషణలు అర్ధవంతంగా ఉంటాయి. కానీ తండేల్ లో చూస్తే చందూ మొండేటి బాలీవుడ్ బి గ్రేడ్ ట్రీట్ మెంట్ తో జైలు ప్రహసనాన్ని ఓవర్ డ్రామాతో నడిపించాడు. అక్కడ జరిగిన సంఘటనలు నిజం కావొచ్చు కాకపోవచ్చు. కానీ నాటకీయత మోతాదు మించకూడదు.

జైల్లో చిన్న పిల్లాడికి జరిగే పరాభవం, గోడ మీద నేషనల్ ఫ్లాగ్ కు చేసే అవమానం ఇవన్నీ తండేల్ ఉన్నతమైన ఉద్దేశాన్ని తగ్గించేశాయి. పైపెచ్చు ఇంత అవసరమా అనిపించే అవకాశమూ ఇచ్చాయి. అలా కాకుండా దీన్ని మణిరత్నం తరహాలో క్లాసీగా డీల్ చేసి ఉంటే రాజు, సత్యల మధ్య ప్రేమ ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది.

పొద్దున్న లేస్తే పాకిస్థాన్ ని తిట్టుకుంటూ ఉండేంత పరిస్థితులు ఇప్పుడు లేవు. అలాంటప్పుడు డ్రామా అండర్ ప్లే కావాలి. కానీ చందూ దానికి రివర్స్ లో ఓవర్ ఎక్స్ ప్లోర్ చేయడంతో సరిగా క్లిక్ అవ్వలేదు. అయినా రోజాని కాస్త రిఫరెన్స్ గా తీస్తే తండేల్ ఇంకా మెరుగ్గా ఉండేదేమో. పెద్ద స్థాయికి చేరుకుందేమో.