బ్యాడ్ అంటూనే భేష్షుగా చూస్తున్నారు

మేము పాత చింతకాయ పచ్చడి సినిమా తీస్తున్నాం అని పబ్లిసిటీ చేయాలంటే నిర్మాతకు బోలెడు ధైర్యం కావాలి. అందులోనూ ఒక ఫేడ్ అవుట్ హీరో మీద భారీ బడ్జెట్ పెట్టినప్పుడు. కానీ బాలీవూడ్ మూవీ ‘బ్యాడ్ ఆస్ రవికుమార్’ విషయంలో ప్రొడ్యూసర్లు ఈ రిస్కు తీసుకున్నారు. ఏదైతే ట్రోలింగ్ కు గురవుతుందని అందరూ భావించారో అదే ఇప్పుడు వరంగా మారింది.

నిన్న రిలీజైన ఈ క్రిన్జ్ ఎంటర్ టైనర్ కు సుమారు అయిదు నుంచి పది కోట్ల మధ్యలో వసూళ్లు వచ్చాయని ట్రేడ్ టాక్. అమీర్ ఖాన్ సెలబ్రిటీలందరినీ తీసుకొచ్చి మరీ ప్రోమోట్ చేసిన తన కొడుకు సినిమా లవ్ యాపాకు ఇందులో సగం కూడా రాలేదు.

అలాని బ్యాడ్ ఆస్ రవికుమార్ బాగుందని కాదు. నిజంగానే టైటిల్ కు తగ్గట్టు రొట్ట రొటీన్ గా ఉంది. భరించలేని యాక్షన్, మితిమీరిన ఎలివేషన్, బాబోయ్ అనిపించే ఫైట్లు, హద్దులు దాటిన డైలాగులు ఒకటా రెండా సర్వ అవలక్షణాలు ఈ సినిమాలో ఉన్నాయి. అయితేనేం ఒక్కోసారి శుచీ శుభ్రత లేని రోడ్డు సైడ్ బిర్యానీ కోసం జనాలు ఎగబడినట్టు ఈ చిత్రానికి వర్కౌట్ అయ్యేలా ఉంది.

హిమేష్ రేషమియా చాలా కాలంగా ఫామ్ లో లేడు. హీరోగా సంగీత దర్శకుడిగా తన ఉనికికి ప్రేక్షకులు దాదాపు మర్చిపోయారు. అలాంటి టైంలో ఈ బ్యాడ్ యాస్ రవికుమార్ తో వచ్చి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.

ఇందులో ప్రభుదేవా ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. బడ్జెట్ లెక్క లేనట్టుగా ఖర్చు పెట్టారు. దేశవిదేశాల్లో షూట్ చేశారు. ఖరీదైన లొకేషన్లు ఎన్నో ఉన్నాయి. హిమేష్ స్వీయ నిర్మాణం కావడంతో బోలెడంత క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నాడు. కీత్ గోమ్స్ దర్శకత్వం వహించాడు.

ఇంత రోతగా ఉన్నా ఒకవేళ సూపర్ హిట్ అయినా ఆశ్చర్యం లేదని నార్త్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కమర్షియల్ మసాలాలకు మొహం వాచిపోయిన ఉత్తరాది జనాలకు ఇప్పుడు బ్యాడ్ ఆస్ రవికుమార్ నచ్చడంలో ఆశ్చర్యం లేదు. తమిళ బ్లాక్ బస్టర్ లవ్ టుడే రీమేక్ గా రూపొందిన లవ్ యాపాకు మాత్రం స్పందన సోసోగానే ఉంది.