సినీ రంగంలో నటులుగా తొలి అవకాశం రావడం ఒకెత్తయితే.. తొలి సక్సెస్ అందుకోవడం ఇంకో ఎత్తు. కొందరికి తొలి అవకాశంతోనే కెరీర్ మలుపు తిరుగుతుంది. స్టార్ స్టేటస్ సంపాదించేస్తారు. కొందరు మాత్రం చాలా ఏళ్ల పాటు పెద్దగా గుర్తింపు లేని పాత్రలే చేస్తుంటారు. బ్రేక్ రావడానికి టైం పడుతుంది. ఆ బ్రేక్ వచ్చినపుడు వారి అన్నేళ్ల కష్టానికి ఫలితం దక్కుతుంది. దశ మారిపోతుంది.
బాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లావత్‌కు ‘పాతాళ్ లోక్’ అనే వెబ్ సిరీస్ అలాంటి మలుపే అయింది. ఈ సిరీస్ చేయడానికి ముందు ‘విశ్వరూపం’ సహా పలు చిత్రాల్లో నటించాడు జైదీప్. నటుడిగా కొంచెం పేరొచ్చింది కానీ.. కెరీర్లో ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. ఐతే చిన్న స్థాయి నటుడు అని చూడకుండా ‘పాతాళ్ లోక్’లో జైదీప్‌కు లీడ్ రోల్ చేసే అవకాశం ఇచ్చారు దాని మేకర్స్.
అమేజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమ్ అయిన ఆ సిరీస్ బ్లాక్ బస్టర్ అయింది. జైదీప్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.‘పాతాళ్ లోక్’తో జైదీప్ బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. అదే సమయంలో ఈ సిరీస్‌కు కొనసాగింపుగా తీసిన ‘పాతాళ్ లోక్-2’లోనూ నటించాడు. గత నెలలోనే స్ట్రీమింగ్‌కు వచ్చిన రెండో సీజన్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. దీంతో జైదీప్ పాపులారిటీ ఇంకా పెరిగింది.
విశేషం ఏంటంటే.. ‘పాతాళ్ లోక్’ తొలి సీజన్‌కు అతను కేవలం రూ.40 లక్షల పారితోషకమే తీసుకున్నాడట. ఇలాంటి ఓ సిరీస్‌లో తనకు అవకాశం రావడమే గొప్ప అని పారితోషకం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ సిరీస్ అతడికి స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టింది. రెండో సీజన్‌కు తన రెమ్యూనరేషన్ ఎకంగా 50 రెట్లు పెరిగింది.
బాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లకు దీటుగా రూ.20 కోట్ల పారితోషకం పుచ్చుకున్నాడట ఈ సిరీస్‌కు. తొలి సీజన్ చూసిన వాళ్లు కథ కోసమే కాక.. జైదీప్ కోసం సెకండ్ చూస్తున్నారనడంలో సందేహం లేదు. కాబట్టి అతడికీ రెమ్యూనరేషన్ ఇవ్వడం పూర్తిగా సమంజసం అనే చెప్పాలి.