నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్ నుంచి వాయిదా పడుతూ ఎట్టకేలకు పోటీ లేని సోలో డేట్ దక్కించుకుంది. ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అల్లు అరవింద్, బన్నీ వాస్ లు జనాలకు సినిమాను చేరవేయడంలో వంద శాతం సక్సెస్ సాధించారు.
ఇక కావాల్సిందల్లా పాజిటివ్ టాక్. ఓవర్ సీస్ ప్రీమియర్ల నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఆశాజనకంగా ఉండటం ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల షోల నుంచి వచ్చే స్పందన మధ్యాన్నానికి పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది కాబట్టి ఫలితం సాయంత్రానికి చెప్పేయొచ్చు.
పాజిటివ్ వైబ్స్ బలంగా ఉన్న తండేల్ ఆడటం నాగచైతన్యకు చాలా కీలకం. ఎందుకంటే గత కొన్ని ఫ్లాపులు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. అందుకే చైతు ప్రీ ప్రొడక్షన్ స్టేజిలోనే శ్రీకాకుళం వెళ్లి మరీ అక్కడి వేషభాషలు, యాసలు నేర్చుకుని వచ్చాడు. నెలల తరబడి స్క్రిప్ట్ లో భాగమయ్యాడు.
అంతా సరిగా వస్తోందో లేదో ప్రత్యక్షంగా చూసుకున్నాడు. మత్స్యకారుల జీవితాలను దగ్గరుండి చూశాడు. వీటితో పాటు డాన్సుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా సాయిపల్లవితో పోటీకి సై అన్నాడు. వీటికి తోడు తండేల్ బడ్జెట్ విషయంలో బన్నీ వాస్, అల్లు అరవింద్ రాజీపడకపోవడం అంచనాలు పెంచింది.
కేవలం టీమ్ కే కాదు తండేల్ సక్సెస్ కావడం ఇండస్ట్రీకి కూడా అవసరమే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత థియేటర్లను నింపిన సినిమా మరొకటి రాలేదు. డాకు మహారాజ్ మొదటి వారం దూకుడు తర్వాత నెమ్మదించడం వసూళ్ల మీద ప్రభావం చూపించింది. ఇక గేమ్ ఛేంజర్ కొట్టిన దెబ్బ తెలిసిందే.
జనవరి నాలుగో వారం నుంచి వెంకటేష్, బాలకృష్ణ సినిమాలు లేని చాలా థియేటర్లు మెయింటెనెన్స్ ఖర్చులు సైతం కిట్టుబాటు కాక భారంగా నడుస్తున్నాయి. వాటికిప్పుడు తండేల్ ఆక్సిజన్ అవ్వాలి. అలా జరిగితే తండేల్ లో రాజు భాషలో చెప్పాలంటే బాక్సాఫీస్ దుల్ల కొట్టేయాలి. అలా జరగాలనే ఆశిద్దాం.