విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు వచ్చాయి కానీ ఫైనల్ గా పోస్ట్ పోన్ లేకుండా చెప్పిన డేట్ కే వస్తోంది. టీజర్ లో చిన్న శాంపిల్ చూపించిన టీమ్ తాజాగా ట్రైలర్ తో పూర్తి కంటెంట్ ఎలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చింది.
సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే సహజంగానే కాస్త బోల్డ్ విషయాలు ఉంటాయి. దానికి అనుగుణంగానే లైలాలో సీన్లు, సంభాషణలు కనిపిస్తున్నాయి. కొంత భాగం మగాడిగా, మరికొంత భాగం వేషం మార్చుకున్న అమ్మాయిగా విశ్వక్ పెద్ద సాహసమే చేస్తున్నాడు స్టోరీ ఏంటో కూడా చెప్పేశారు.
బ్యూటీ సలూన్ నడుపుకునే సోను (విశ్వక్ సేన్) అనుకోకుండా చేసిన పని వల్ల ఎమ్మెల్యే కంట్లో పడతాడు. ఎలాగైనా ప్రాణాలు తీయాలని వెంటపడుతున్న విలన్ గ్యాంగ్ నుంచి తప్పించుకునే క్రమంలో సోను ఎవరూ గుర్తు పట్టని విధంగా అమ్మాయి మేకప్ వేసుకుంటాడు.
తీరా చూస్తే ఎవరైతే కత్తులతో తరుముతున్నారో వాళ్లే రివర్స్ లో ప్రేమించడం మొదలుపెడతారు. కథ ఎటెటో తిరిగి మిస్ లైలానే పెళ్లి చేసుకుంటామని స్థానిక గూండా లీడర్లు తీర్మానించుకునే దాకా వెళ్తుంది. మరి ఈ చెడుగుడు ఆటలో లైలా ఎలా గెలిచిందో, ముసుగు తీశాక వచ్చిన ప్రమాదాన్ని ఎలా ఎదురుకుందో తెరమీద చూడాలి.
మేడమ్ రాజేంద్ర ప్రసాద్, చిత్రం భళారే విచిత్రం నరేష్, భామనే సత్యభామ కమల్ హాసన్ తర్వాత అంత ఎక్కువ లెన్త్ తో హీరో అమ్మాయిగా కనిపించడం లైలాతోనే అని చెప్పొచ్చు. కాకపోతే ట్రెండ్ కు తగ్గట్టు స్పైసి సీన్లు బాగానే పెట్టినట్టు కనిపిస్తోంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చాడు.
బొద్దుగా విశ్వక్ సేన్ లైలాగా పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా సబ్జెక్టు డిమాండ్ కు తగ్గట్టు ఒదిగిపోయాడు. కెరీర్ ఎదుగుతున్న టైంలో ఇలాంటి రిస్క్ చేసిన విశ్వక్ సేన్ ఈ లైలాతో కనక మెప్పిస్తే మరిన్ని ప్రయోగాలకు జెండా ఊపొచ్చు.