ఐటీ చిక్కులు ఇప్పుడప్పుడే వదిలేలా లేవు

టాలీవుడ్ ను కుదిపేసిన ఆదాయపన్ను శాఖ దాడులు ఇప్పుడప్పుడే ముగిసేలా లేవు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా రోజుల తరబడి ఐటీ శాఖ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో రాజు గారి ఇల్లు, కార్యాలయాలతో పాటుగా రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్షితల ఇల్లు, కార్యాలయాలనూ ఐటీ అధికారులు జల్లెగ పట్టారు. ఈ సోదాలు ముగిసినట్లుగా ప్రకటించిన ఐటీ అధికారులు… రాజు కార్యాలాయాల నుంచి పెద్ద మొత్తంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని… రాజును వెంటబెట్టుకుని మరీ వెళ్లిపోయారు.

ఆ తర్వాత రాజును విచారించి అదికారులు ఆయనను వదిలేశారు.ఈ సందర్భంగా నిర్ణిత గడువు తర్వాత మరోమారు విచారణకు రాజుకు వారు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం రాజు పెద్ద మొత్తంలో పత్రాలను చేతబట్టుకుని ఐటీ కార్యాలయానికి వెళ్లారు. రాజువెళ్లిన తీరు చూస్తుంటే… ఈ దఫా విచారణ సుదీర్ఘంగానే సాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐటీ సోదాలను నాడు రాజు చాలా లైట్ గా తీసుకున్నట్లు ఆయన వ్యాఖ్యలు చెప్పాయి. అందరి మాదిరే తనపైనా ఐటీ రెయిడ్స్ జరుగుతున్నాయని, ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే… దిల్ రాజు ఇళ్లలో సోదాలు చేసిన సందర్భంగా ఐటీ అధికారురులు ఆయన సతీమణిని వెంటబెట్టుకుని బ్యాంకులకు తీసుకుని వెళ్లి మరీ లాకర్లను పరిశీలించిన వైనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి విడుదలై మంచి వసూళ్లు రాబట్టిన మూడు సినిమాల్లో దిల్ రాజు కీలక పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన రాజు.. ఓ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. వీటి ద్వారా భారీ ఎత్తునే రాజు ఆర్జించారని, అయితే ఆ మేరకు ఆయన పన్ను చెల్లింపులు లేవన్న బావనతోనే ఐటీ సోదాలు జరిగాయన్న వాదనలు వినిపించాయి. మరి ఈ సోదాల నుంచి రాజు ఎప్పుడు బయటపడతారో చూడాలి.