లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్ సేన్ లైలా, కిరణ్ అబ్బవరం దిల్ రుబాతో పోటీ ఉండేది. కానీ ఇప్పుడవి రెండూ తప్పుకునే సూచనలు ఎక్కువ కావడంతో బ్రహ్మానందం ఆనందం మాములుగా లేదు.
ఎందుకంటే ఓపెనింగ్స్ మీద పోటీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పైగా వారబ్బాయి గౌతమ్ కీలక పాత్ర పోషించినప్పటికీ అతనికి ఇమేజ్ లేని దృష్ట్యా హైప్ పెంచే భారం మొత్తం తండ్రి మీదే ఉంది. వెన్నెల కిషోర్ ఇంకో లీడ్ రోల్ చేయడం కామెడీ ఎక్కువగా ఉందనే సంకేతం అయితే ఇచ్చింది.
గత కొంత కాలంగా బ్రహ్మానందం సినిమాల్లో కనిపించడం తగ్గించేశారు. తన స్థాయికి తగ్గ పాత్రలు రాయడం ప్యాన్ ఇండియా దర్శకులు సైతం ఇబ్బంది పడుతున్నారు. అందుకే కల్కి 2898 ఏడి లాంటి గ్రాండియర్ లోనూ మొక్కుబడిగా కనిపిస్తారు. కానీ బ్రహ్మ ఆనందం ఆ బాపతు కాదు.
ఇందులో నవ్వించడమే కాదు డాన్సులు చేయడం, ఎమోషన్ తో ఏడిపించడం లాంటివి చాలా చేశారు. పైగా కొడుక్కి తాతగా నటించే వెరైటీ భాగ్యం దక్కించుకున్నారు. పబ్లిసిటీ భారం తన మీదే ఉండటంతో వీలైనంతగా ఆయనే అన్ని చూసుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియా మీమర్స్ తో ఒక ఈవెంట్ కూడా చేసుకున్నారు.
కాకపోతే ముందు వారం తండేల్ వచ్చి ఉంటుంది. అది కనక సంక్రాంతికి వస్తున్నాం తరహాలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే బ్రహ్మ ఆనందంకు కొంత చిక్కులు తప్పవు. కాకపోతే చాలా బాగుందనే మాట వస్తే ఆడియన్స్ ఖచ్చితంగా వస్తారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ కు శాండిల్య పీసపాటి సంగీతం సమకూర్చారు.
కంటెంట్ బాగుండాలే కానీ స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా జనం ఆదరిస్తారని గతంలో బలగం, రైటర్ పద్మభూషణ్ లాంటివి నిరూపించాయి. ఒకప్పుడు సోలో హీరోగా కొన్ని సినిమాల్లో మెప్పించిన బ్రహ్మానందం లేట్ వయసులో ఎలాంటి మేజిక్ చేసి అబ్బురపరుస్తారో చూడాలి.