బన్నీ ఆబ్సెంట్ – ఒక ప్లస్సు ఒక మైనస్సు

నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండేల్ రాజ్ ని పుష్పరాజ్ కలుసుకోవడాన్ని చూసి ఆనందిద్దామని ఎదురు చూసిన అభిమానులు చివరి నిమిషంలో అల్లు అర్జున్ రావడం లేదని తెలుసుకుని నిరాశ పడ్డారు. దానికి చిన్న అనారోగ్యం కారణమని చివర్లో అల్లు అరవింద్ వివరించినా ఏ నిమిషంలో అయినా బన్నీ వస్తాడని టీవీ, యూట్యూబ్ చూస్తున్న ఫ్యాన్స్ ఉసూరుమన్నారు.

సంధ్య దుర్ఘటన తర్వాత బన్నీ పబ్లిక్ అప్పియరెన్స్ ఇప్పటిదాకా జరగలేదు. అందుకే తండేల్ వేడుక మీద ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే ఇలా జరగడం వల్ల తండేల్ కు ఒక ప్లస్సు ఒక మైనస్సు జరిగాయి. అవేంటో చూద్దాం.

ఒకవేళ అల్లు అర్జున్ వచ్చి ఉంటే మీడియాతో పాటు ఫ్యాన్స్ ఫోకస్ తన మీద ఎక్కువగా ఉండేది. అందులోనూ పుష్ప 2 ప్రస్తావన తేవాల్సి వచ్చేది. ఫ్యాన్స్ హడావిడి లేదు కాబట్టి అల్లరి సమస్య లేదు కానీ పోలీస్ సెక్యూరిటీ హడావిడి వల్ల ఎంతో కొంత ఇబ్బందులైతే తలెత్తేవి.

సో రాకపోవడం వల్ల దృష్టి మొత్తం నాగచైతన్య, సాయిపల్లవి, గెస్టుగా వచ్చిన సందీప్ రెడ్డి వంగాల మీదకు వెళ్ళిపోయింది. ఇది బజ్ పరంగా ఉపయోగపడేదే. ఇక మైనస్ సంగతి చూస్తే తండేల్ మీద అంచనాలు బాగున్నప్పటికీ హై అనిపించే వాతావరణం ఇంకా పెరగాలి. ట్రైలర్ కొంత మిశ్రమ స్పందన దక్కించుకోవడం ప్రభావం చూపించింది.

ఒకవేళ బన్నీ వచ్చి తండేల్ నిర్మాణం, తండ్రి అల్లు అరవింద్ పడిన కష్టం ఇవన్నీ వివరించి ఉంటే హైప్ పరంగా ప్రేక్షకుల్లోకి ఇంకా వేగంగా వెళ్ళేది. సరే జరిగేదంతా మన మంచికే అన్నట్టు ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న తండేల్ సంక్రాంతికి వస్తున్నాం వచ్చిన మూడు వారాల తర్వాత రిలీజవుతున్న పెద్ద సినిమా.

ఓపెనింగ్స్ మీద బయ్యర్లు నమ్మకంగా ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, స్టోరీ బ్యాక్ డ్రాప్, క్లాస్ మాస్ కు నచ్చే అంశాలు ఇవన్నీ జనంలో ఆసక్తి పెంచుతున్నాయి. ఎలాగూ పోటీ లేదు కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే చాలు కనీసం రెండు మూడు వారాల పాటు భారీ వసూళ్లు నమోదు కావడం ఖాయం.