గజిని 2: అరవింద్ అన్నారు కానీ… నిజంగా జరిగే పనేనా?

ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన గజిని మూవీ లవర్స్ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్. సూర్య కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పి తెలుగుతో పాటు ఇతర భాషల్లో మార్కెట్ తీసుకొచ్చింది. ఏఆర్ మురగదాస్ అనే దర్శకుడిని అమీర్ ఖాన్ తో రీమేక్ చేసేలా ప్రేరేపించింది. ఇదంతా జరిగి రెండు దశాబ్దాలు అయిపోయింది.

గజిని 2 రావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కానీ ఆ దిశగా అడుగులు పడినట్టు ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఈ మధ్య దీని హిందీ రీమేక్ నిర్మించిన అల్లు అరవింద్ నోట సీక్వెల్ ప్రస్తావన వస్తోంది. నిన్న ముంబైలో జరిగిన తండేల్ ట్రైలర్ ఈవెంట్ లోనూ అది బయట పెట్టారు.

అమీర్ ఖాన్ ముఖ్యఅతిథిగా రావడంతో ఆయన ముందే తన కోరికను బహిర్గతం చేశారు. అయితే గజిని 2 చాలా రిస్క్ తో కూడుకున్నది. ఏ మాత్రం తొందరపడినా బ్రాండ్ దెబ్బ తింటుంది. శంకర్ భారతీయుడుని ఇలా చేయబోయే ట్రోలింగ్ బారిన పడ్డారు. అనవసరంగా క్లాసిక్ చెడగొట్టారని కమల్ హాసన్ అభిమానులే విరుచుకుపడ్డారు.

ఇది ఎంత డ్యామేజ్ అంటే మొదటి భాగాన్ని చూడని వారికి సైతం దాని మీద ఆసక్తి పోయేంతగా. మరి గజిని 2 విషయంలోనూ ఈ రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ మురుగదాస్ భీకరమైన ఫామ్ లో లేడు. సల్మాన్ ఖాన్ తో సికందర్ చేస్తున్నాడు కానీ సౌత్ హీరోలతో హిట్టు కొట్టి చాలా కాలమయ్యింది.

సో గజిని 2 అంటే చాలా లెక్కలు చూసుకోవాలి. ముందైతే కథ సిద్ధం కావాలి. ఆ మధ్య మురుగదాస్ ని అడిగితే ఐడియా ఉంది కానీ ఇంకా స్క్రిప్ట్ గా మార్చలేదని అన్నారు. సో చాలా సమయం పడుతుంది. ఈ గోలంతా ఎందుకంటే గజినీ 2 ప్రతిపాదన ఇక్కడితో ఆపేస్తే బెటర్.

బాహుబలి, పుష్ప, కెజిఎఫ్ లాగ తక్కువ గ్యాప్ లో వెంటవెంటనే సీక్వెల్స్ వస్తే వర్కౌట్ అవుతాయి కానీ ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన వాటిని కొనసాగించడం వల్ల కలిగే ప్రయోజనం తక్కువ. అయినా వెయ్యి కోట్ల సినిమా చేయాలని ఉన్నప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు అల్లు అరవింద్ ఏదైనా ప్యాన్ ఇండియా స్టోరీని ఎవరైనా క్రేజీ దర్శకుడితో తీయిస్తే బెటరేమో.