RC 16 – శుభవార్త చెప్పిన శివన్న

గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోవడంతో మెగాభిమానుల దృష్టి ఆర్సి 16 వైపుకు వెళ్తోంది. తాజాగా మూడో షెడ్యూల్ మొదలుపెట్టిన దర్శకుడు బుచ్చిబాబు షూటింగ్ లో ఎలాంటి జాప్యం లేకుండా చూసుకుంటున్నాడు. విడుదల తేదీ ఇంకా నిర్ణయించుకోనప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ తో కలిపి మొత్తం ఏడు నెలల్లో గుమ్మడికాయ కొట్టాలనేది లక్ష్యమని యూనిట్ టాక్.

జాన్వీ కపూర్ త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెట్టనుంది. స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తి చేసిన బుచ్చిబాబు ప్రతిదీ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతున్నాడు. పాటల చిత్రీకరణ తర్వాత పెట్టుకుని ముందు టాకీ పార్ట్ మీద దృష్టి పెడుతున్నాడు. ఇక అసలు మ్యాటర్ వేరే ఉంది చూద్దాం.

ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే క్యాన్సర్ చికిత్స కోసం గత నెల అమెరికా వెళ్లిన శివన్న పూర్తిగా కోలుకోవడానికి ఎంత టైం పడుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు. ఆ దిగులు అక్కర్లేకుండా ఆయన తిరిగి వచ్చేశారు.

నిన్న బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అందరి ఆశీర్వాదం, ప్రార్థనల వల్ల పూర్తిగా కోలుకున్నానని, త్వరలోనే సినీ ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నట్టు ప్రకటించారు. మార్చి నుంచి రామ్ చరణ్ 16లో భాగం కాబోతున్నట్టు హింట్ ఇచ్చారు. అంటే ఎంతో దూరంలో లేదన్న మాట.

రామ్ చరణ్ కు శిక్షణ ఇచ్చే కుస్తీ మాస్టర్ గా శివన్న క్యారెక్టర్ రెగ్యులర్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. కీలకమైన మలుపులకు కారణమయ్యేలా బుచ్చిబాబు డిజైన్ చేసినట్టు తెలిసింది. పల్లెటూరి నేపథ్యంతో పాటు స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ పెట్టిన బుచ్చిబాబు అసలు రామ్ చరణ్ ని ఎలా చూపించబోతున్నాడో ఊహకు అందివ్వడం లేదు.

ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ విలేజ్ డ్రామాకు పెద్ది టైటిల్ పరిశీలనలో ఉంది. హీరో పుట్టినరోజుకు రివీల్ చేసే ఛాన్స్ ఉంది. గేమ్ ఛేంజర్ తీవ్రంగా నిరాశపరచడంతో ఆ గాయాన్ని పూర్తిగా మానిపోయేలా చేసే బాధ్యత ఆర్సి 16 మీద ఉంది.