వివాదాలకు దారి చూపిస్తున్న బ్యాడ్ గర్ల్

కల్ట్ ఫిలిం మేకర్స్ గా బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్, కోలీవుడ్ లో వెట్రిమారన్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమాలో గర్వంగా చెప్పుకునే కొన్ని క్లాసిక్స్ వీళ్ళ నుంచి వచ్చాయి. గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే, వడ చెన్నై, విసరనై కొన్ని ఉదాహరణలు మాత్రమే.

అలాంటిది వీళ్లిద్దరు కలిసి నిర్మాతలుగా మారి ఒక చిత్రం మీద పెట్టుబడి పెట్టారంటే సగటు మూవీ లవర్స్ అందరికీ ఖచ్చితంగా ఆసక్తి కలుగుతుంది. అదే బ్యాడ్ గర్ల్. వర్ష భరత్ దర్శకత్వంలో రూపొందిన ఈ న్యూ ఏజ్ యూత్ డ్రామాకు సైరాకు పాటలిచ్చిన అమిత్ త్రివేది సంగీతం సమకూర్చడం విశేషం.

అయితే టీజర్ వచ్చినప్పటి నుంచి బ్యాడ్ గర్ల్ మీద వివాదాలు మొదలయ్యాయి. ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి మగ స్నేహాల పట్ల ఆకర్షితురాలై, వ్యసనాలకు అలవాటు పడి, ఆఖరికి తల్లి తండ్రులు నిలువరించాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే దాకా ఆమె జీవితం ఎలా నడిచిందనే పాయింట్ మీద కథ నడిపారు.

పాత్రల మధ్య సంభాషణలు మరీ బోల్డ్ గా ఉన్నాయి. ఒక అమ్మాయి అబ్బాయి సంభాషించుకోకూడని విషయాలు పొందుపరిచారు. వీటి గురించే కాంట్రావర్సి వస్తోంది. అగ్ర కులాల యువతులను కావాలని చెడుగా చూపిస్తున్నారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

టైటిల్ రోల్ పోషించిన అంజలి శివరామన్ పెర్ఫార్మన్స్ ప్రధానమైన హైలైట్ గా నిలుస్తున్న బ్యాడ్ గర్ల్ అసలు రిలీజ్ టైంలో కంటెంట్ పరంగా నిరసన సెగలు చవి చూడాల్సి వచ్చేలా ఉంది. ఇలాంటివి యూత్ కి ఎలాంటి సందేశాలు ఇవ్వవని, పైపెచ్చు పక్కదారి పట్టడం ఎలా, పెద్దలను ఎదిరించడం పక్కగా నేర్పించినట్టు ఉందని పలువురు బ్యాడ్ గర్ల్ మీద భగ్గుమంటున్నారు.

ఒక కులానికి సంబంధించిన వర్గం కేసులు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయినా ఏ సర్టిఫికెట్ తో ఇలాంటివి థియేటర్లకు వచ్చేస్తాయి కానీ ప్రభావం ఎంత ఉంటుందనేది చూడాలి. ఇదంతా మనకెందుకంటే తెలుగు డబ్బింగ్ కూడా సిద్ధం చేయబోతున్నారు.