శోభనకు పద్మభూషణ్….తెలుగువాళ్లకూ గౌరవమే

నిన్న ప్రకటించిన పద్మ పురస్కారాల్లో బాలకృష్ణతో పాటు శోభనకు పద్మభూషణ్ దక్కడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆవిడ స్వరాష్ట్రం కేరళ అయినప్పటికీ టాలీవుడ్ తో అవినావ సంబంధం ఉంది. తెలుగులో అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన అనుభవముంది.

1984లో ‘మార్చండి మన చట్టాలు’తో డెబ్యూ చేసిన శోభన రెండు సంవత్సరాలకే నాగార్జున డెబ్యూ మూవీ ‘విక్రమ్’లో ఛాన్స్ కొట్టేసింది. తర్వాత వెంకటేష్ తో ‘అజేయుడు’ అవకాశం దక్కింది. చిరంజీవి ‘రుద్రవీణ’లో దళిత అమ్మాయిగా చేసిన నటన గుర్తుండిపోయింది. బాలయ్య ‘నారి నారి నడుమ మురారి’ మరో సూపర్ హిట్ ఇచ్చింది.

కొన్నేళ్లపాటు శోభన తెలుగులో చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. రౌడీ అల్లుడు, రౌడీ గారి పెళ్ళాం, కోకిల, రెండిళ్ళ పూజారి, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, అల్లుడు దిద్దిన కాపురం, కన్నయ్య కిట్టయ్య, రక్షణ ఇలా బోలెడు సినిమాలు తన ఖాతాలో పడ్డాయి. 1997లో మమ్ముట్టి సుమన్ మల్టీస్టారర్ ‘సూర్యపుత్రులు’ తర్వాత శోభన చాలా కాలం కనిపించలేదు.

మలయాళం, తమిళంలో కొనసాగినా టాలీవుడ్ కు దూరంగా ఉన్నారు. 2006 మోహన్ బాబు మంచు విష్ణు ‘గేమ్’తో రీ ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాది వచ్చిన ‘కల్కి 2898 ఏడి’ కోసం దర్శకుడు నాగ అశ్విన్ ఒప్పించి మరీ శోభనను ఈ ప్యాన్ ఇండియా మూవీలో భాగం చేశారు.

శోభన కేవలం ఆర్టిస్టుగానే కాకుండా నృత్య కళాకారిణిగా ఎన్నో సేవలు అందించడమే కాక బోలెడు పురస్కారాలు దక్కించుకున్నారు. 2006లోనే పద్మశ్రీ వరించింది. అన్ని భాషలో కలిపి 230కి పైగా సినిమాల్లో నటించడం హీరోయిన్ గా పెద్ద ట్రాక్ రికార్డు. గ్లామర్ షోకు దూరంగా శోభన ఎప్పుడూ ఒక కమిట్ మెంట్ తో పని చేసేవారు.

అందుకే స్టార్ హీరోలు కోరిమరీ తమకు జోడిగా అంగీకరించేవారు. పెళ్లి చేసుకోకున్నా ఒక బిడ్డను దత్తత తీసుకుని తల్లి మాధుర్యాన్ని ఆస్వాదించారు. చంద్రముఖి ఒరిజినల్ వెర్షన్ ‘మణిచిత్రతజు’లో నటనకు గాను 1993లోనే జాతీయ అవార్డు దక్కించుకున్నారు. టాలీవుడ్ తోనూ విడదీయలేని బంధం శోభనది.