ఇటీవలే టాలీవుడ్ అగ్ర నిర్మాతల మీద ఐటి శాఖ దాడులు జరిగిన తర్వాత అధిక శాతం వినిపిస్తున్న మాట ప్రొడ్యూసర్లు పోస్టర్లలో వేసుకుంటున్న కలెక్షన్ల నెంబర్ల వల్లే జరిగిందని. పుష్ప 2 నుంచి గేమ్ ఛేంజర్ దాకా దీని మీద సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరిగింది. ఎవరు రైట్ ఎవరు రాంగనే దానికన్నా అసలిది కొత్తగా మొదలైన ట్రెండ్ కాదనేది వాస్తవం.
నిజానికి మన దేశంలో ఒక సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయని చెప్పాడానికి ఎలాంటి నిర్దిష్టమైన వ్యవస్థ లేదు. ట్రేడ్ వర్గాలు, ట్రాకర్స్, డిస్ట్రిబ్యూటర్లు తదితర వర్గాల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఓ మోస్తరు అంచనా మీద తప్ప ఖచ్చితమైన ఫిగర్లు ఎవరూ చెప్పరు.
లవకుశ మొదటి కోటి రూపాయల చిత్రంగా తెరకెక్కినా, అడవి రాముడు తొలిసారి నాలుగు కోట్లు వసూలు చేసినా, ఘరానా మొగుడు ఫస్ట్ టెన్ క్రోర్ గ్రాసర్ అంటూ చదువుకున్నా ఇవన్నీ నిర్ధారణగా చెప్పేందుకు చరిత్ర పుస్తకాలేం అందుబాటులో లేవు. పత్రికలు, మీడియాతో పాటు ఇతరత్రా సోర్సుల నుంచి వచ్చిన న్యూస్ ని బట్టి రిఫరెన్స్ గా వాడుకుంటూ ఉంటాం.
కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిదీ క్షణాల్లో వైరలవుతున్న ట్రెండ్ లో అభిమానులకు కలెక్షన్ల పిచ్చి పట్టుకుంది. వాళ్ళను సంతృప్తి పరిచేందుకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు అంకెలు పెంచి చూపించడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే.
నేనింతేలో షియాజీ షిండే పాత్ర ద్వారా పూరి జగన్నాథ్ చాలా స్పష్టంగా ఈ కోణాన్ని వివరించారు. ఫ్యాన్స్ ఎలా వెర్రి తలలు వేస్తారో సాయిరామ్ శంకర్ క్యారెక్టర్ రూపంలో అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. నిజాలు కాబట్టే జనానికి ఎక్కక ఫ్లాప్ అయ్యింది. ఇది పక్కనపెడితే మార్కెటింగ్ లో ఈ కలెక్షన్ల మాయాజాలం కీలక పాత్ర పోషిస్తున్న మాట వాస్తవం.
ఇన్ని వందల కోట్లు వచ్చాయంటే సినిమా అంత బాగుందేమోనని ప్రేక్షకులు అనుకునేలా ఇవి ప్రభావితం చేస్తున్న దాఖలాలు లేకపోలేదు. ఆలాని అబద్దాలు చెబితే చెలామణి అయిపోవు. రెండో రోజే మనం చెబుతున్నది నిజమో కాదో ఆడియన్స్ గుర్తు పట్టేస్తారు.
దిల్ రాజు అన్నట్టు ఇలా చేయడం కరెక్టా కాదా అనేది అందరూ కూర్చుని మాట్లాడుకుని నిర్ణయించుకోవాలి. లేదూ మా పోస్టర్లు మా ఇష్టమని ఎవరైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే దాన్నీ తప్పు బట్టేందుకు లేదు. ఎవరిష్టం వారిదని వదిలేయడం తప్ప. కేవలం డబ్బులను ప్రతిపాదికన తీసుకుని ఒక సినిమా హిట్టా కాదా అని డిసైడ్ చేస్తున్న ట్రెండ్ లో దీన్ని అంత సులభంగా మార్చలేరు.
కొందరు దర్శక నిర్మాతలు ఇష్టపడకపోవచ్చు కూడా. సో ఇప్పటికిప్పుడు అనూహ్యమైన మార్పులు జరగకపోవచ్చు. కథ మళ్ళీ మొదటికే రావొచ్చు. అసలే ఈ ఏడాది బోలెడు ప్యాన్ ఇండియా సినిమాలున్నాయి. సో స్టోరీ కంటిన్యూస్.