తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే. అందులో గుమ్మడి నర్సయ్యగా కనిపించబోయేది కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కావడం విశేషం. నెలన్నర కిందట ఈ సినిమాను అనౌన్స్ చేసినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేమీ కమర్షియల్ టచ్ ఉన్న సినిమా కాదు. ఇలాంటి సినిమాలో ఇక్కడి నటులెవ్వరూ కాకుండా శివరాజ్ లాంటి కన్నడ సూపర్ స్టార్ నటించడానికి ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ చిత్రం శనివారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. పాల్వంచలో జరిగిన ఈ వేడుకకు శివరాజ్ హాజరయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఎందరో ప్రముఖులు ఈ వేడుకకు వచ్చి శివరాజ్ మీద ప్రశంసలు కురిపించారు. సీఎం ప్రోగ్రాం ఉన్నా సరే ఈ వేడుకకు రావడానికి గుమ్మడి నర్సయ్యపై తనకున్న గౌరవం.. శివరాజ్ ఆయన పాత్రను పోషించడమే కారణమని కోమటిరెడ్డి వివరించారు.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా శివరాజ్ ప్రసంగం కూడా అందరినీ ఆకట్టుకుంది. మన కోసం కాదు, ఇతరుల కోసం బతకాలి అని తన తండ్రి రాజ్ కుమార్ చెప్పేవారని.. గుమ్మడి నర్సయ్య అలాంటి మనిషే అని.. అలాంటి గొప్ప వ్యక్తి కథ అనేసరికి ఏమీ ఆలోచించకుండా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని శివరాజ్ తెలిపారు. తనకు తెలుగు సరిగా రాదని.. కానీ ఈ సినిమా కోసం భాష నేర్చుకుని నర్సయ్య పాత్రకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటానని చెప్పడం ద్వారా శివరాజ్ తన డెడికేషన్‌ను చాటుకున్నారు.
పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడిగా గుమ్మడి నర్సయ్యకు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఆయన సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా.. ఆడంబరాలకు పోలేదు. పదవిలో ఉన్నపుడు, ఆ తర్వాత ఆయనది సాధారణ జీవితమే.
ఇప్పటికీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు.. మందీ మార్బలం లేకుండా ఒక్కడే జనాల మధ్య తిరుగుతుంటారు. పేదలు, గిరిజనుల కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. అలాంటి వ్యక్తి సినిమా చేయడానికి శివరాజ్ ముందుకు రావడం విశేషమే. ఈ చిత్రానికి పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates