మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో హీరోగా రూపొందుతున్న కన్నప్పలో ప్రభాస్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. శివరాత్రికి రావొచ్చనే అంచనాల మధ్య ఇంకో నెల రోజులు వెయిట్ చేయక తప్పేలా లేదు. ఇటీవలే శివుడి గెటప్ లో అక్షయ్ కుమార్ లుక్ రివీల్ చేశాక డార్లింగ్ ఏ రూపంలో కనిపిస్తాడనే ఆసక్తి సామాన్య ప్రేక్షకుల్లోనూ ఉంది.
అయితే నిడివి ఎంత ఉండొచ్చనే దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి కానీ 20 నిమిషాల నుంచి అరగంట దాకా ప్రభాస్ క్యారెక్టర్ ఉండొచ్చని అంటున్నారు. మనిషి రూపంలో తిరిగే బసవయ్యగా చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని అంటున్నారు.
ఇక్కడితో అయిపోలేదు. ప్రభాస్ ఇంట్రోనే ఒక పాటతో మొదలవుతుంది. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఇటీవలే ఒక రియాలిటీ షోలో ఆయన ఈ ముచ్చట చెప్పారు. డాన్స్ డివోషనల్ గా ఉంటుంది కానీ మరీ మాస్ ని టార్గెట్ చేసే విధంగా కాకపోవచ్చు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం శివ దర్శనం ముందు వచ్చే ఎపిసోడ్ లో ఈ సాంగ్ ఉండొచ్చని వినికిడి. యాక్షన్ సన్నివేశాలు లేకపోయినా ప్రభాస్ కు తగినంత స్క్రీన్ స్పేస్ తో పాటు బలమైన సీన్లు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తీశారని అంటున్నారు. విష్ణు దీనికి సంబంధించిన డీటెయిల్స్ చాలా గుట్టుగా ఉంచుతున్నాడు.
ఏప్రిల్ 25 విడుదల కాబోతున్న కన్నప్ప మార్కెటింగ్ కు ప్రభాస్ కీలకం కానున్నాడు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా భాషల్లో బిజినెస్ జరగడానికి తన ఇమేజ్ చాలా ఉపయోగపడుతుంది. అయితే మూడు నెలల ముందే ప్రోమోలు, పోస్టర్లు వదిలితే అసలు టైంకి ఎగ్జైట్ మెంట్ తగ్గిపోతుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారట.
మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితరులతో భారీ తారాగణం సెట్ చేసుకున్న కన్నప్ప 2025లో ప్రభాస్ నుంచి వచ్చే మొదటి సినిమా కావొచ్చు. ది రాజా సాబ్ ఏప్రిల్ 10 నుంచి తప్పుకున్న నేపథ్యంలో కన్నప్పకు డార్లింగ్ ఫ్యాన్స్ ఇచ్చే వెల్కమ్ భారీగా ఉండబోతోంది.