వెంకటేష్ కెరీర్ లో మొదటి వెబ్ సిరీస్ గా వచ్చిన రానా నాయుడుకు వ్యూస్ మిలియన్లలో వచ్చాయి కానీ కంటెంట్ పరంగా విమర్శలు కూడా తక్కువేమీ లేవు. ఎందుకంటే కథా కథనాలు మరీ బోల్డ్ గా ఉండటంతో పాటు తెలుగు డబ్బింగ్ లోనూ పుష్కలంగా బూతులు జొప్పించడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది.
ముఖ్యంగా వెంకీకి ఫ్యామిలీస్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. దాన్ని నమ్ముకుని రానా నాయుడు చూడటం మొదలుపెట్టిన కుటుంబాలు ఫస్ట్ ఎపిసోడ్ కే కట్టేసే పరిస్థితి వచ్చింది. ఇదంతా దర్శక నిర్మాతలు, హీరో దృష్టికి వెళ్లకుండా లేదు. అందుకే సీజన్ 2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వెంకటేష్ ఈ విషయాన్ని సంక్రాంతికి వస్తున్నాం ప్రెస్ మీట్ లో మరోసారి స్పష్టం చేశారు. ఓటిటిలు చూడటం వల్ల బూతులు వస్తాయని బుల్లిరాజు క్యారెక్టర్ ద్వారా చెప్పించిన వైనం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. రానా నాయుడు మీద నెగటివిటీ తన దృష్టికి రాలేదని, అయినా సరే సీక్వెల్ కోసం అంత డోస్ లేకుండా తగ్గించామని హామీ ఇచ్చారు.
షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న రానా నాయుడు 2 ఎప్పుడు స్ట్రీమింగ్ అనేది నెట్ ఫ్లిక్స్ ప్రకటించలేదు. ఈ ఏడాది ఉంటుంది కానీ స్లాట్ నిర్ణయం ఇంకా జరగలేదు. వెంకీ, రానాతో పాటు మిగిలిన పాత్రలు ఇందులో కొనసాగబోతున్నాయి. సో ఈసారి గట్టి నమ్మకమే పెట్టుకోవచ్చు.
ఇదంతా ఎలా ఉన్నా స్టార్ హీరోలు వెబ్ సిరీస్ లు చేసేటప్పుడు కంటెంట్ ఎలా ఉందో బాగా చెక్ చేసుకోవడం అవసరం. ట్రెండ్ పేరుతో మరీ బోల్డ్ నెస్ ని ప్రోత్సహించినా అది వేరే దారిలో వెళ్లే ప్రమాదం ఉంది. అందులోనూ వెంకటేష్ లాంటి క్లీన్ హీరో నుంచి అలాంటివి ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు.
నిజంగానే రానా నాయుడులో ద్వందార్థాలను పిల్లలు కనక ప్రాక్టీస్ చేస్తే బుల్లిరాజుని మించి పోవడం ఖాయం. అందుకే సీజన్ 2కి హోమ్లీ టచ్ ఇవ్వబోతున్నారు. అది ఎంత మోతాదులో ఉంటుందనేది వేచి చూడాలి. ఇలాంటి కంప్లయింట్స్ ఏవీ రాని నాగచైతన్య దూత లాంటివి మరిన్ని రావాలని ఫ్యాన్స్ కోరిక.