పుష్ప 2 యాభై రోజులు – తగ్గకుండా కొట్టేసింది

గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు చేసినా మహా అయితే నెల రోజుల కంటే థియేట్రికల్ రన్ దక్కడం గగనమైపోయింది. ఆర్ఆర్ఆర్, దేవర, కల్కి ఇలా ఏది తీసుకున్నా ఇదే జరిగింది. కానీ పుష్ప 2 ది రూల్ కలెక్షన్లలోనే కాదు చాలా కాలం నిలిచిపోయే రికార్డుల విషయంలోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్ళిపోయింది.

ఇవాళ ఈ బ్లాక్ బస్టర్ 50వ రోజు. స్ట్రెయిట్, షిఫ్టింగ్ అన్ని కలిపి సుమారు అయిదు వందల స్క్రీన్లలో ఇవాళ ఈ ఫీట్ నమోదయ్యిందని ట్రేడ్ టాక్. థియేటర్ మారకుండా తెలుగు రాష్ట్రాలలో పాతిక పైగానే సెంటర్లుండొచ్చని ఒక రిపోర్ట్.

రెండు వేల కోట్లకు దగ్గరగా ఉన్న పుష్ప 2 ఇటీవలే రీ లోడెడ్ పేరుతో అదనంగా ఇరవై నిముషాలు జోడించుకుని వచ్చాక మళ్ళీ ఊపందుకుంది. సంక్రాంతి తర్వాత బుక్ మై షోలో గేమ్ ఛేంజర్ ని దాటేసి పుష్ప 2 ట్రెండింగ్ లోకి రావడం డిస్ట్రిబ్యూషన్ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న పుష్ప 2 ఓటిటి విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా ఉపయోగపడింది.

56 రోజుల దాకా స్ట్రీమింగ్ ఉండదని నిర్మాతలు తేల్చి చెప్పడంతో డిజిటల్ వెర్షన్ కోసం ఎదురు చూసే ప్రయాస పడకుండా అధిక శాతం జనాలు టికెట్లు కొని చూశారు. ఇవాళ హైదరాబాద్ సంధ్యలో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి.

ఏది ఏమైనా పుష్ప 2 ది రూల్ చాలా కాలం చెప్పుకునే విజయం కానుంది. గ్రాఫిక్స్, ఫాంటసీ లేని ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ తో వేల కోట్లు కొల్లగొట్టవచ్చని నిరూపించిన దర్శకుడు సుకుమార్ బన్నీ ఇమేజ్ ని అమాంతం పది మెట్లు పైకి ఎక్కించేశారు. పుష్పని ఒక బ్రాండ్ గా మార్చేశారు.

భవిష్యత్తులో ఎప్పుడు పుష్ప 3 తీసినా అంచనాలు ఆకాశాన్ని దాటుతాయని చెప్పడంలో అనుమానం అక్కర్లేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, భారీ బడ్జెట్, తారాగణం, మాస్ ఫైట్లు, ఎలివేషన్లు, అన్నింటిని మించి బన్నీ పెర్ఫార్మన్స్ పుష్ప 2ని ఇండియా ఇండస్ట్రీ హిట్ గా మార్చింది. బాలీవుడ్ మనవైపే చూసేలా గర్వంగా నిలబడింది.