అసలు రూపం మారిపోయిన ‘భైరవం’

ఒక రీమేక్ ఎంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శకులకు పెద్ద సవాల్ గా మారిపోయింది. ఒరిజినల్ వెర్షన్ ని సబ్ టైటిల్స్ తోనో లేదా డబ్బింగ్ ఆడియోలోనో చూసి ముందే అవగాహనకు వస్తున్న ప్రేక్షకులు పెరిగిపోతున్నారు. అలాని ప్రతిదీ వర్కౌట్ అవ్వదని కాదు. సరైన మార్పులు చేర్పులు చేసుకుంటే ఖచ్చితంగా మెప్పించే అవకాశం ఉంటుంది.

భైరవం వర్క్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. బెల్లకొండ సాయిశ్రీనివాస్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత తెలుగులో కనిపించబోతున్న సినిమా ఇదే. నారా రోహిత్, మంచు మనోజ్ లతో స్క్రీన్ పంచుకోవడంతో దీని మీద క్రమంగా అంచనాలు రేగడం మొదలయ్యింది.

గత ఏడాది కోలీవుడ్ సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన గరుడన్ రీమేక్ ఇది. అయితే తాజాగా వచ్చిన భైరవం టీజర్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మూలకథను తీసుకుని తెలుగు మాస్ ఆడియన్స్ కి తగ్గట్టు చేసిన కీలక మార్పులు బాగానే కనిపిస్తున్నాయి. ముగ్గురు ప్రాణ స్నేహితులు, వాళ్ళ మధ్య బంధాన్ని రామలక్ష్మణులు, ఆంజనేయుడులతో పోలుస్తూ తీర్చిదిద్దిన క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉంది.

ఈ మధ్య బ్లాక్ బస్టర్స్ లో బాగా పండుతున్న జాతర ఎపిసోడ్ ఒకటి భైరవంలోనూ ఉంది. సాయిశ్రీనివాస్ నటనలోని కొత్త కోణంలో ఇందులోనే చూడొచ్చు. చిన్న శాంపిల్ ని టీజర్ లో చూపించారు.

నాంది, ఉగ్రం ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవంని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డేట్ ఇంకా నిర్ణయించలేదు. దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్ కు ఈ సినిమాతోనే పరిచయమవుతోంది. సీనియర్ నటి జయసుధ చాలా కాలం తర్వాత నాయనమ్మగా ముఖ్యమైన పాత్ర పోషించారు.

క్యాస్టింగ్ పెద్దదే ఉంది. గుడి భూములకు సంబంధించిన వివాదం ముగ్గురు స్నేహితులు, ఒక పచ్చని గ్రామం మీద ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చిందనే పాయింట్ మీద భైరవం రూపొందింది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా ఆనంది, దివ్య పిళ్ళై తదితరులు మిగిలిన తారాగణం.

Bhairavam Official Teaser | Bellamkonda Sreenivas, Manoj Manchu, Nara Rohith |Vijay Kanakamedala