విశ్వంభర మీదే మెగాభిమానుల భారం

గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోయింది. పండగ సెలవులు పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర పడిపోయింది. యావరేజ్ అయినా అభిమానులు కాస్త ఊరట చెందేవాళ్ళేమో కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. దీనికి తోడు ట్రోలింగ్, హెచ్డి పైరసీ లాంటివి గాయాన్ని మరింత పెద్దవి చేశాయి. ఇప్పుడు వాళ్ళ దృష్టి విశ్వంభర మీదకు వెళ్తోంది.

నిజానికి మెగా టీమ్ నుంచి హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల కావాల్సి ఉంది. కానీ ఈలోగా రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ లు ఆ డేట్, తర్వాతి రోజు తేదీ వరసగా తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ రావడం లేదనే సందేహం మరింత బలపడింది. అంటే ముందు చిరంజీవివే రావొచ్చన్న మాట.

మెగా హీరోలకు గత కొంతకాలంగా కలిసి రావడం లేదు. రామ్ చరణ్ కు గేమ్ ఛేంజర్ కన్నా ముందు ఆచార్య చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆర్ఆర్ఆర్ కు ముందు వినయ విధేయ రామ మరో ట్రాజెడీ. ట్రిపులార్ మల్టీస్టారర్ కాబట్టి సోలో హీరో కౌంట్ లోకి రాదు. సో చరణ్ మళ్ళీ ప్రూవ్ చేయాల్సింది బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న ఆర్సి 16తోనే.

హైప్ భారీగా ఉంది కానీ విడుదలకు టైం ఉంది. వరుణ్ తేజ హ్యాట్రిక్ ఫ్లాపులు పూర్తి చేసుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో హిట్టు కొట్టినా బ్రో దగ్గర దొరికిపోయాడు. వైష్ణవ్ తేజ్ జాడే మర్చిపోయేలా షాకుల మీద షాకులు తింటున్నాడు. ఉప్పెన తర్వాత ఏదీ కలిసి రాలేదు.

ఇక చిరంజీవి భోళా శంకర్ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. సో ఒకవేళ ఏప్రిల్ లేదా మేలో కనక విశ్వంభర వస్తే దాని విజయంతో మళ్ళీ సంబరాలు చేసుకోవాలనేది మెగా ఫాన్స్ కోరిక. టీజర్ మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చాక విఎఫ్ఎక్స్ టీమ్ ని మార్చేసి కొత్తగా పనులు చేయిస్తున్నారనే టాక్ ఉంది.

అందుకే కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదన్నది ఇన్ సైడ్ టాక్. దర్శకుడు వశిష్ట చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కానీ అది ఎంత మోతాదులో ఉందనేది ట్రైలర్ వస్తే కానీ అర్థం కాదు. యూనిట్ వర్గాలు మాత్రం ఊహించని స్థాయిలో కంటెంట్ వస్తోందని ఊరిస్తున్నారు. అది జరగాలనేదే అభిమానుల కోరిక. చూద్దాం.