నిన్న డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ బాగా ఎమోషనల్ అయిపోతూ సినిమాను చంపొద్దంటూ, సోషల్ మీడియాలో మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేయడం పట్ల పెద్ద చర్చే జరుగుతోంది. దానికి చిరంజీవి తనను ఈ ప్రసంగం కదిలించిందంటూ స్పందించడం, బదులుగా తమన్ భగవద్గీత శ్లోకాన్ని ఉటంకిస్తూ కృతజ్ఞతలు చెప్పడం జరిగాయి. పుట్టిన బిడ్డను కళ్ళు తెరవక ముందే హత్య చేయొద్దంటూ తమన్ చెప్పడం గేమ్ ఛేంజర్ గురించేనని మెగా ఫ్యాన్స్ కే కాదు సగటు ప్రేక్షకులకూ అర్థమైపోయింది. ఎందుకంటే బాలయ్య, వెంకీ సినిమాలకు ఏ ఆటంకం రాలేదు.
నిశితంగా గమనిస్తే సమస్య కేవలం గేమ్ ఛేంజర్ దే కాదు. హెచ్డి పైరసీ ప్రింట్ లీక్ కావడం ఎప్పుడో అత్తారింటికి దారేది టైంలోనే చూశాం. ట్రోలింగ్ అంటే గుంటూరు కారంతో మొదలుపెట్టి దేవర దాకా దీని బారిన పడని హీరో ఎవరూ లేరు. సీనియర్లకు సైతం ఈ బాధ తప్పలేదు. భోళాశంకర్ టైంలో చిరంజీవి, రూలర్ సమయంలో బాలకృష్ణ అందరూ చవిచూశారు. మహేష్ బాబు మెసేజులు ఇచ్చే సినిమాలు చేసినా గేలి చేసినవాళ్లు కోకొల్లలు. కావాలనే డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో తప్పుడు చర్యలకు పాల్పడుతున్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేకపోవడం రాను రాను అనర్థాలు పెరిగిపోయేలా చేస్తోంది.
మొన్నో లోకల్ ఛానల్ లో గేమ్ ఛేంజర్ ప్రసారం చేస్తే తప్పు చేసిన వాళ్ళను పట్టుకున్నారు కానీ నిజంగా వాళ్లకు శిక్షలు పడతాయా అంటే సమాధానం దొరకడం కష్టం. పైరసీ, ట్రోలింగ్, వ్యక్తిత్వ హననాలు, మార్ఫింగ్, డీప్ ఫేక్ వీడియోలు ఒకటా రెండా పరిశ్రమ మీద జరుగుతున్న ముప్పేట దాడి అంతా ఇంతా కాదు. తప్పు చేస్తున్న వాళ్ళు ధైర్యంగా తమ పనులు కొనసాగిస్తుంటే భయం ఎక్కడి నుంచి వస్తుంది. ఇకనైనా ప్రభుత్వాలు వీటిపట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. చైనా, జపాన్ తరహాలో ఇండస్ట్రీని కాపాడేందుకు వ్యవస్థలు మారాలంటున్నారు. వెంటనే కాకపోయినా భవిష్యత్తులో అయినా జరగాలి.