లక్షలాది అఘోరాల మధ్య అఖండ 2 తాండవం

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవం మొదలుపెట్టిన దర్శకుడు బోయపాటి శీను మహాకుంభమేళాకు వెళ్లి కోట్లాది మధ్య జనసందోహం మధ్య షూటింగ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రయాగరాజ్ లో జరుగుతున్న ఈ అద్భుత ఉత్సవానికి సగటున రోజు యాభై లక్షలకు పైనే భక్తులు హాజరవుతున్నారు.

అఘోరాల విన్యాసాలు, సన్యాసుల సమూహాలు, దేవతా మూర్తుల ఊరేగింపులు, భక్తుల ఆనంద పారవశ్యాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళాకు మొత్తం దేశ జనాభాలో పాతిక శాతానికి పైగా పాల్గొంటారని ఒక అంచనా.

అలాంటి చోట చిత్రీకరణ అంటే పెద్ద సవాలే. అయితే బోయపాటి బాలకృష్ణను తీసుకెళ్లి చేయలేదు. ఒక ముఖ్యమైన ఘట్టానికి సంబంధించిన ఫుటేజ్ తీసుకోవడంతో పాటు కొన్ని సన్నివేశాలు షూట్ చేశారని తెలిసింది. మళ్ళీ ఇంకోసారి వెళ్లే అవకాశం ఉంది.

అఖండ 2 కథ మొత్తం పెద్ద బాలయ్య చుట్టే తిరగనుంది. లోక వినాశనానికి పూనుకున్న దుష్టశక్తులను అంతమొందించేందుకు అపారమైన దివ్య శక్తులను ప్రోగు చేసుకునే క్రమంలో చాలా కీలకమైన ఎపిసోడ్ ఈ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. తెరమీద చూస్తే రోమాలు నిక్కబొడుచుకునే స్థాయిలో దీని తాలూకు సీన్లు ఉంటాయని తెలిసింది.

సెప్టెంబర్ లో విడుదల ఫిక్స్ చేసుకున్న అఖండ 2 ఎలాంటి అవాంతరాలు లేకుండా అనుకున్న టైంకి రిలీజ్ చేసేలా బోయపాటి శీను పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. డాకు మహారాజ్ రిలీజైపోయింది కాబట్టి బాలకృష్ణ పూర్తి డేట్లు దీనికే కేటాయించబోతున్నారు.

సింహా, లెజెండ్, అఖండలతో ఒకదాన్ని మించి మరొకటి ఘనవిజయాలు అందుకున్న హీరో దర్శకుడి కాంబోగా ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద మాములు అంచనాలు లేవు. తమన్ అయిదోసారి బాలయ్యకు ఛార్ట్ బస్టర్ బీజీఎమ్, పాటలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రగ్య జైస్వాల్ తో పాటు మొదటి భాగం తారాగణం ఇందులో భాగం కానుంది.