2025 సంక్రాంతి.. నెవర్ బిఫోర్ రికార్డు

సంక్రాంతికి ప్రతిసారీ మూడు నాలుగు సినిమాలు రిలీజ్ కావడం మామూలే. కానీ వాటిలో ఒకటి రెండు మంచి టాక్ తెచ్చుకుని దూసుకెళ్తాయి. మిగతావి బోల్తా కొడుతుంటాయి. సంక్రాంతికి 100 పర్సంట్ సక్సెస్ రేట్ చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. 2017లో ఆ అరుదైన దృశ్యమే చూశాం. ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు మూడూ పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు సాధించాయి.

దానికి ముందు, తర్వాత ఎప్పుడూ సంక్రాంతికి 100 పర్సంట్ సక్సెస్ చూడలేదు. ఐతే ఈ ఏడాది రిలీజైన మూడు సినిమాల్లో ఏదీ పూర్తి నెగెటివ్ టాక్ తెచ్చుకోకపోవడం విశేషం. మూడు చిత్రాలకూ ఓపెనింగ్స్‌కు ఢోకా లేదు. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుండగా.. ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. యావరేజ్ టాక్‌తో మొదలైన ‘గేమ్ చేంజర్’ పడుతూ లేస్తూ సాగుతోంది.

ఆ చిత్రానికి నష్టాలు తప్పవు కానీ.. ఫ్లాప్ అనే పరిస్థితి అయితే లేనట్లే కనిపిస్తోంది. ఇప్పటిదాకా సంక్రాంతికి ఎన్నడూ జరగని ఓ ఘనత ఈసారి సాధ్యమవుతుండడం విశేషం. తెలుగు నుంచి రిలీజైన మూడు చిత్రాలూ వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్బులోకి అడుగు పెడుతున్నాయి. ‘గేమ్ చేంజర్’ తొలి రోజే ఈ మార్కుకు చేరువగా వెళ్లింది. ప్రస్తుతం కలెక్షన్లు రూ.200 కోట్ల మార్కుకు చేరువగా ఉన్నాయి.

‘డాకు మహారాజ్’ విడుదలైన నాలుగో రోజు వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తొలి రోజే రూ.45 కోట్లు కొల్లగొట్టింది. రెండో రోజుకు వసూళ్లు రూ.80 కోట్లకు చేరుకున్నాయి. ఈ రోజు ఈ చిత్రం వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టడం లాంఛనమే.

దేని టాక్ ఎలా ఉంది, అంతిమంగా ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతున్నాయి అన్నది పక్కన పెడితే.. తెలుగులో ఈ పండక్కి రిలీజైన ప్రతి సినిమా వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టడం టాలీవుడ్ బాక్సాఫీస్ స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పేదే. మొత్తంగా ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ రూ.500 కోట్లకు పైగా బిజినెస్ చేసేలా కనిపిస్తుండడం విశేషం.