బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన ఘటన సినిమా ఇండస్ట్రీని, అభిమానులను షాక్‌కు గురి చేసింది. బుధవారం రాత్రి 2:30 గంటల సమయంలో ఒక దుండగుడు సైఫ్ నివాసంలోకి చొరబడి ఆయనపై దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ వెన్నెముక, మెడపై తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
సైఫ్ వెన్నుప్రాంతంలో కత్తి మొన ఇరుక్కుపోవడం వల్ల శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు. మెడ, వెన్నుపై జరిగిన గాయాలు కొద్దిగా తీవ్రంగానే ఉన్నప్పటికీ, మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దాడి సమయంలో సైఫ్ కుమారుడు ఇబ్రహీం సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తండ్రిని వెంటనే ఆసుపత్రికి తరలించడం గమనార్హం.
రాత్రి సమయములో ఏ వాహనమూ అందుబాటులో లేకపోవడంతో, ఆటోలోనే సైఫ్‌ను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇబ్రహీం తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆసుపత్రి వర్గాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాడు. ఈ దాడి వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను ఆధారంగా తీసుకొని దర్యాప్తు చేపట్టారు.
దీనిపై బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ ప్రస్తుతం చికిత్స పొందుతుండగా, ఆయన త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ దాడి ఉదంతం తర్వాత, సినీ ప్రముఖుల భద్రతపై పునరాలోచన అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.