RC16 : గేరు మారుస్తున్న బుచ్చి

జరిగిందేదో జరిగిపోయిందని గేమ్ ఛేంజర్ ఫలితాన్ని మర్చిపోయే దిశగా వెళ్తున్నారు మెగా ఫ్యాన్స్. మూడేళ్ళ కష్టానికి తగ్గ రిజల్ట్ రాకపోయినా, కనీసం అబోవ్ యావరేజ్ అని చెప్పుకునే అవకాశం కూడా లేనట్టు వసూళ్లు తగ్గిపోవడం వాళ్ళను కలవరపరిచింది. దీనికి తోడు హెచ్డి పైరసీ అగ్నిలో ఆజ్యం పోసినట్టు గాయాన్ని ఇంకాస్త పెద్దది చేసింది.

సరే హిట్లు ఫ్లాపులు అందరు హీరోలకు సహజమే కానీ ఇక ఇప్పుడు చేయాల్సింది భవిష్యత్ ప్రణాళిక. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సి 16 మీద అభిమానులు అంచనాలు అంతా ఇంతా కాదు. ప్రకటన దశ నుంచే దీని మీద విపరీతమైన హైప్ నెలకొనడం చూస్తున్నాం.

నిజానికి దీని విడుదలని వచ్చే సంవత్సరం ప్లాన్ చేయాలనుకున్నారు కానీ ప్రస్తుతం ఆ లక్ష్యం మారిందని ఇన్ సైడ్ టాక్. ఈ ఏడాది అక్టోబర్ లోనే రిలీజ్ చేసే దిశగా నిర్ణయం మారుతోందని సమాచారం. చేతిలో ఇంకా పది నెలలు ఉంది కాబట్టి అదేమంత కష్టం కాదనేది యూనిట్ అభిప్రాయం.

బుచ్చిబాబు స్క్రిప్ట్, షెడ్యూల్, పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్నింటికీ సంబంధించిన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకున్నాడట. ఎలాంటి అవాంతరాలు రాకపోతే ఖచ్చితంగా టార్గెట్ మీట్ అవుతానని అంటున్నాడట. దీనికి పూర్తి సహకారం అందించేందుకు చరణ్ పూర్తి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

సో బుచ్చిబాబు మాస్ మరీ ఆలస్యం కాకపోవచ్చు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ విలేజ్ డ్రామాలో క్యాస్టింగ్ చాలా క్రేజీగా ఉంది. కాకపోతే ఒకే సమస్య ఉంది. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇంకో నెలలో తిరిగి రాబోతున్నారు.

ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎంత రెస్ట్ తీసుకుంటారు, చరణ్ సినిమాకు ఎన్ని డేట్లు, ఎంత ప్రాధాన్యం ఇస్తారనే దాన్ని బట్టి కూడా టార్గెట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇతర ఆర్టిస్టుల మీద టాకీ పార్ట్ జరుగుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం మీద చాలా అంచనాలున్నాయి. మార్చి 27 చరణ్ బర్త్ డేకి టీజర్ వదిలే ఛాన్స్ ఉంది.