ఖైదీ దర్శకుడి డ్రీం ప్రాజెక్ట్ నెరవేరుతుందా ?

సందీప్ కిషన్ మానగరంతో పేరు తెచ్చుకుని కార్తీ ఖైదీతో ఒక్కసారిగా ఫాలోయింగ్, మార్కెట్ రెండూ పెంచుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆ తర్వాత మాస్టర్, విక్రమ్, లియో రూపంలో బ్లాక్ బస్టర్స్ అందుకోవడమే కాక విజయ్ తో పాటు కమల్ హాసన్ కు తిరుగులేని హిట్లు సాధించి పెట్టాడు.

అప్పటి నుంచి తమిళంలోనే కాక తెలుగులోనూ క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలి చేస్తున్న లోకేష్ అందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి దిగ్గజాలను భాగం చేయడం ద్వారా అంచనాలు ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. అయితే ఇతనికంటూ ఒక డ్రీం ప్రాజెక్టు ఉంది.

దాని పేరు ఇరుంబుకై మాయావి. నిజానికిది తన డెబ్యూగా ఎన్నో సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకున్నాడు. సూర్య హీరోగా ప్రాజెక్టు లాక్ చేసుకుని ఆ మేరకు పోస్టర్లు కొన్ని వదిలారు. కానీ బడ్జెట్ తదితర కారణాల వల్ల ఇది సెట్స్ కు వెళ్లకుండానే ఆగిపోయింది.

భారీ విఎఫ్ఎక్స్ అవసరమున్న ఫాంటసీ కథ ఇది. శరీరం లేకుండా హీరో చెయ్యి చేసే సాహసాల ఆధారంగా రాసుకున్నాడు. ఇది ఇంకా ఎప్పటికి తెరకెక్కదేమోనని ఫ్యాన్స్ భావించారు. కట్ చేస్తే ఈ స్టోరీని లోకేష్ కనగరాజ్ ఇటీవలే అమీర్ ఖాన్ కు వినిపించాడట. సబ్జెక్టు నచ్చి స్వంత ప్రొడక్షన్ లో చేద్దామని అమీర్ ప్రోత్సహించినట్టు చెన్నై టాక్.

అయితే ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందనేది చెప్పలేం. ఎందుకంటే కూలి అయ్యాక లోకేష్ ఖైదీ 2కి కమిటయ్యాడు. విక్రమ్ 2, రోలెక్స్ సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా ఉన్నాయి. వీటిని కాదని ఇరుంబుకై మాయావికి ఓటు వేస్తాడా అనేది అనుమానమే.

ఒకవేళ అమీర్ ఖాన్ సీరియస్ గా తీసుకుంటే మాత్రం మిగిలినవి పెండింగ్ లో ఉంచి లోకేష్ దీనికే మొగ్గు చూపొచ్చు. సమాధానం చెప్పాల్సింది కాలమే. 2025 దీపావళి విడుదలకు లక్ష్యంగా పెట్టుకున్న కూలి కోలీవుడ్ లో మొదటి వెయ్యి కోట్ల గ్రాసర్ గా నిలబడుతుందని అక్కడి ట్రేడ్ అంచనా వేస్తోంది. సినిమా బాగుంటే జరిగే ఛాన్స్ లేకపోలేదు.