పంజా విసిరిన డాకు – మొదటి రోజు రికార్డు బ్రేకు

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో ఊపుమీదున్న బాలకృష్ణ మరో ఘనవిజయంతో కొత్త రికార్డుకి శ్రీకారం చుట్టబోతున్నట్టు డాకు మహారాజ్ ఓపెనింగ్స్ తో అర్థమైపోయింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల గ్రాస్ వసూలైనట్టు సితార సంస్థ అధికారికంగా ప్రకటించింది.

నిన్న తెల్లవారుఝామున ఏపీలో బెనిఫిట్ షోలతో మొదలైన పాజిటివ్ టాక్ క్రమంగా పెరగడంతో దాని ప్రభావం సానుకూలంగా ఇతర షోల మీద పడి ఆక్యుపెన్సీలు భారీగా నమోదయ్యాయి. ముఖ్యంగా నైజాం, సీడెడ్ లాంటి ప్రాంతాల్లో డాకు ముద్ర బలంగా ఉందని, పలు కేంద్రాల్లో రికార్డు నెంబర్లు నమోదు కావడం ఖాయమని డిస్ట్రిబ్యూటర్ల టాక్.

ఇది బాలయ్య కెరీర్ లో అత్యధిక డే 1 రికార్డు. గతంలో ఇది వీరసింహారెడ్డి పేరు మీద ఉండగా ఇప్పుడు డాకు మహారాజ్ దాన్ని దాటేసింది. దర్శకుడు బాబీ ఇచ్చిన ఎలివేషన్లు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అభిమానులు ఊగిపోతున్నారు. పెద్ద డైలాగులు లేకుండా ఇంత మాస్ హీరోయిజం పండించడం పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

హెచ్చుతగ్గుల మీద కొన్ని కామెంట్స్ ఉన్నప్పటికీ పండగ సీజన్ లో మాస్ కి కాలక్షేపం చేయించడంలో డాకు మహారాజ్ విజయవంతం కావడంతో కలెక్షన్లు భారీగా ఉన్నాయి. రేపు సంక్రాంతికి వస్తున్నాం టాక్ బట్టి ఏ మేరకు ప్రభావం ఉంటుందో అంచనా వేయొచ్చు.

ప్రమోషన్ టైంలో నిర్మాత నాగవంశీ చెప్పినట్టు యాక్షన్ బ్లాక్స్ బ్రహ్మాండంగా వర్కౌటయ్యాయి. రిపీట్ ఆడియన్స్ వచ్చేందుకు ఇది దోహదం చేయనుంది. పాటలు తక్కువగా ఉన్నప్పటికీ ఇంత ఫలితం దక్కడం విశేషం. ఊర మాస్ అంశాలు తగ్గినట్టు అనిపించినా ఆ లోటేమి తెలియనివ్వకుండా ఒక సరికొత్త ట్రీట్ మెంట్ తో డాకు మహారాజ్ ని తీర్చిదిద్దిన వైనం ప్రశంసలు అందుకుంది.

ఫైనల్ స్టేటస్ ఎక్కడ నిలబడుతుందనేది చెప్పడానికి కనీసం పది రోజులు పడుతుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాలి. యుఎస్ లో మొదటి రోజే 1 మిలియన్ దాటేసిన డాకు మహారాజ్ అక్కడా మైలురాళ్ళు నమోదు చేయనుంది.